National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రూ.142 కోట్లు లబ్ధి

by S Gopi |

దీనికి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడా, ఇతరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రూ.142 కోట్లు లబ్ధి
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. వారిద్దరూ రూ.142 కోట్ల లబ్ది పొందారని, ఆ మొత్తాన్ని వారు వినియోగించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేసింది. దీనికి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడా, ఇతరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం ఢిల్లీ స్పెషల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏదైనా ఆస్తి నేరపూరిత ఆదాయం అవుతుందని ఈడీ ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు. నేరపూరిత ఆదాయంతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డమే కాకుండా, తమ వద్ద దాచుకున్నారని చెప్పారు. అనంతరం రౌస్ అవెన్యూ తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది. గత నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో, సోనియా, రాహుల్ గాంధీ సహా ఇతరులు రూ. 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. చార్జిషీట్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను పెంచి పోషించారనే కేసు వ్యవహారానికి సంబంధించి 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.రూ.751.9 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది.

Next Story