మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్.. దేశ ప్రజలకు కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-20 11:09:02  IST  )

మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్.. దేశ ప్రజలకు కీలక పిలుపు

మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్.. దేశ ప్రజలకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) పేరు మార్పుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లమంది రైతులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారని అన్నారు. గ్రామీణ పేదలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని సీరియస్ అయ్యారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో కేంద్రం నల్లచట్టం తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ నల్లచట్టంపై పోరాటం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం.. లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య.. పేదలకు జీవనాధారంగా ఉపాధి హామీ పథకం ఉంది.. గత 11 ఏళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పేదలకు ఇది జీవనాధారంగా మారిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ఎంజీ రోడ్‌లో పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు శ్రీధర్‌ బాబు, అజారుద్దీన్‌, జూపల్లి కృష్ణారావు, వివేక్‌, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌, వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం పేరు చెబితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడతాయన్నారు. గాడ్సేని పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు.

Next Story