Sonam Wangchuk: తీవ్రంగా క్షీణించిన వాంగ్‌చుక్ ఆరోగ్యం

by S Gopi |

దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఆయన 8.5 కిలోల బరువు తగ్గినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.

Sonam Wangchuk: తీవ్రంగా క్షీణించిన వాంగ్‌చుక్ ఆరోగ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. నీట్‌ తదితర పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. కండరాల క్షీణత, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన దీక్షను విరమించేందుకు నిరాకరించారు. దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఆయన 8.5 కిలోల బరువు తగ్గినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఈ పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరేతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే వాంగ్‌చుక్ అందుకు స్పష్టంగా నిరాకరించారు. 'నన్ను నిరాహార దీక్ష విరమించమని అడగొద్దు. కనీసం మాతో చర్చలు కూడా ఎందుకు జరపడం లేదో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి' అని ఆయన తనను కలిసిన వారికి చెప్పినట్లు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తేనే సమస్య పరిష్కారానికి మార్గం సుగమమవుతుందనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత విషమించకుండా వెంటనే చర్చలు ప్రారంభించాలని పలువురు నేతలు కూడా కేంద్రాన్ని కోరుతున్నారు.

ఇదే సమయంలో నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సీజేపీ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు కోరుతూ ఐదు సూత్రాల సంస్కరణల చార్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుత చట్టానికి బదులుగా పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త చట్టాన్ని తీసుకురావాలని, ఎన్‌టీఏ స్థానంలో చట్టబద్ధమైన నేషనల్ టెస్టింగ్ కమిషన్, స్వతంత్ర పరీక్షల ఒంబుడ్స్‌మన్, తప్పనిసరి సీఏజీ ఆడిట్లు, విద్యార్థుల హక్కుల చార్టర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. గత పదేళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నా, జవాబుదారీతనం కనిపించడం లేదని సీజేపీ ఆరోపించింది.

Next Story