President : సామాజిక న్యాయానికే తొలి ప్రాధాన్యత.. రాష్ట్రపతి ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ సందేశం

by Hajipasha |   ( Updated:2024-08-14 16:17:07.0  )
President : సామాజిక న్యాయానికే తొలి ప్రాధాన్యత.. రాష్ట్రపతి ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రభుత్వం సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన పురోగతిని సాధించిందని, ఇది సామాజిక ప్రజాస్వామ్యం ముందడుగును ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశం భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు సాగుతోందని, ఒక సంఘటిత శక్తిగా ముందుకు సాగుతోందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక చర్యలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాత్రి ప్రసంగించారు. ‘‘ఆగస్టు 14వ తేదీ దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు ఇది. విభజన సమయంలో వేలాది మంది దేశం విడిచివెళ్లారు. ఈక్రమంలో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాటి విషాదాన్ని స్ఫురణకు వస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. విశాలమైన భారత దేశంలో, సామాజిక అంతరాల ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించాల్సి ఉంటుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. 2020లో ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టిందని ఆమె చెప్పారు.

మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాం

పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధానమంత్రి సామాజిక ఉత్థాన్, రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (పీఎం సురాజ్), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ముర్ము వివరించారు. గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ స్కీమ్‌లను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయా పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే దేశంలోని కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి వివరించారు. ‘‘భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ, సంప్రదాయపరమైన పక్షపాతాలు కొనసాగుతున్నాయి. గత దశాబ్ద కాలంలో మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాం. అన్ని రంగాల్లో మహిళా కార్మికులు, ఉద్యోగుల భాగస్వామ్యాన్ని పెంచాం. మెరుగైన లింగ నిష్పత్తికి బాటలు వేశాం. మహిళా సాధికారత కోసం మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చాం’’ అని రాష్ట్రపతి తెలిపారు.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో పారదర్శకత

విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారతదేశం ఎదగడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని ఆమె గుర్తు చేశారు. స్టార్టప్‌లకు దేశంలో అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని పేర్కొన్నారు. సెమీకండక్టర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌‌లలో పారదర్శకత పెరిగిందని ఆమె చెప్పారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. చరిత్రలో అతిపెద్ద ఎన్నికల క్రతువు అదే. ఆ సమయంలో ఎన్నికల సంఘం, భద్రతా సిబ్బంది పోషించిన పాత్ర అనన్య సామాన్యమైంది’’ అని ముర్ము తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed