అమెరికా చరిత్రలో తొలిసారి: పోలీసుల కస్టడీలో యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్..

by Mallepaka Hamsa |

అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పోలీసులకు లొంగిపోయారు.

అమెరికా చరిత్రలో తొలిసారి: పోలీసుల కస్టడీలో యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్..
X

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పోలీసులకు లొంగిపోయారు. ‘పోర్న్ స్టార్‌కు సెటిల్‌మెంట్ కేసు’లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్.. ఇందుకు సంబంధించిన విచారణ కోసం న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే, విచారణ కన్నా ముందే ఆయన అధికారులకు లొంగిపోయారు. అమెరికా చరిత్రలోనే ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, 2016లో తాను, ట్రంప్ శృంగారంలో పాల్గొన్నామని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినట్టు వెల్లడించారు.

ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకోవడంతో, ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు మోపాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కేసులోనే ట్రంప్.. న్యాయస్థానానికి చేరుకోగా, అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్‌’లో ట్రంప్ స్పందిస్తూ, ‘వావ్, వారు నన్ను అరెస్టు చేయబోతున్నారు. అమెరికాలో ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. కడపటి వార్తలు అందేసరికి, ట్రంప్‌ను అధికారులు జడ్జి ముందు హాజరుపర్చారు. ఇందుకు సంబంధించిన విచారణ మొదలైంది.

Next Story