SIR: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం !

by B.Srinivas |

బిహార్‌లో ఇటీవల ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టిన విషయం తెలిసిందే.

SIR: దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం !
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఇటీవల ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లతో ఈసీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మూడో సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశంలో ఎస్ఐఆర్‌కు సంబంధించిన విధి విధానాలపై చర్చంచనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఎస్ఐఆర్ డ్రైవ్ చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యం !

అక్రమ వలసదారులను ఓటర్ జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా వివిధ దేశాల నుంచి వలసొచ్చి ఇక్కడి ఓటర్ లిస్టులో అక్రమంగా చేరిన వారిని గుర్తించి తొలగించేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టనుంది. బోగస్ ఓట్లను డిలీట్ చేయడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. ప్రక్రియలో భాగంగా పోల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలనున తనిఖీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రాధాన్యత సంతరించుకుంది.

పకడ్భందీగా డ్రైవ్

ఇటీవల బీహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రాల అధికారులతోనూ పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నది. అయితే పత్రాలు లేకపోవడం వల్ల కోట్లాది మంది అర్హులైన పౌరులు ఓటు హక్కును కోల్పోతారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే అర్హులైన పౌరులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సుప్రీంకోర్టు ఈసీని కోరింది. దీంతో ఎటువంటి విమర్శలు లేకుండా ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ రెడీ అవుతోంది.

Next Story