అక్టోబర్‌లోపు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సీఈవోలతో భేటీలో కీలక నిర్ణయం

by B.Srinivas |

బిహార్‌లో ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ అనంతరం దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.

అక్టోబర్‌లోపు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సీఈవోలతో భేటీలో కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనంతరం దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. అయితే ఈ డ్రైవ్ అక్టోబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల (CEO)లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రక్రియకు సంబంధించిన సన్నాహాలను చర్చించగా ప్రతిపాదనకు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. బిహార్ ఎన్నికలు ముగిసేలోపే నేషన్ వైడ్ ఎస్ఐఆర్ మొదలు కానున్నట్టు సమాచారం. కాన్ఫరెన్స్-కమ్-వర్క్‌షాప్ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సిద్ధమయ్యేందుకు గాను సీఈఓలను టైం అడగగా ఈ నెల చివరి నాటికి పనులు పూర్తవుతాయని చెప్పినట్టు తెలుస్తోంది.

సీఈఓలతో మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అనేక ప్రెజెంటేషన్లు ఇచ్చారు. సవరణ సమయంలో ఓటర్లను ధ్రువీకరించడానికి ఉపయోగించగల పత్రాల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ సీఈఓలను ఆదేశించింది. ఇవి స్థానికంగా ఆమోదించిన, సులభంగా లభించే సర్టిఫికెట్ల ఆధారంగా ఉండనున్నాయి. ధ్రువీకరణ ప్రక్రియను ఖరారు చేసేటప్పుడు పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. మరణించిన వారి పేర్లు, వలస దారులను జాబితా నుంచి తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యమని ఈసీ తెలిపింది.

Next Story