Kishan Reddy : సింగరేణి కూడా విదేశాల్లో బ్లాకులు కొనాలి : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) నేడు ఢిల్లీలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్(NCMM) ఔట్‌రీచ్ ఫోరమ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

Kishan Reddy : సింగరేణి కూడా విదేశాల్లో బ్లాకులు కొనాలి : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) నేడు ఢిల్లీలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్(NCMM) ఔట్‌రీచ్ ఫోరమ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ సెమినార్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్స్, రక్షణ, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు క్రిటికల్ మినరల్స్ (లిథియం, కోబాల్ట్, నికెల్ వంటివి) ఎంతో ముఖ్యమని, వీటి సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఈ ఫోరమ్ ఒక వేదికగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ ఫోరమ్ ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయ సహకారాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో గనుల రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిందని, పారదర్శకంగా మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియను అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 34 క్రిటికల్ మినరల్ బ్లాకుల వేలం పూర్తయిందని, ఇందులో లిథియం, గ్రాఫైట్ వంటి ముఖ్యమైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయని వెల్లడించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గత మూడేళ్లలో 445 ప్రాజెక్టులను చేపట్టిందని, 185 ప్రాజెక్టులకు నిధులు కేటాయించామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులు ఖనిజ సంపదను గుర్తించడం, అన్వేషణను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

విదేశీ సహకారంపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీలతో క్రిటికల్ మినరల్స్ సరఫరా, అన్వేషణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. ఈ ఒప్పందాలు భారతదేశ ఇంధన భద్రత, సాంకేతిక అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, మన దేశంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) విదేశాల్లో క్రిటికల్ మినరల్ బ్లాకులను సొంతం చేసుకోవాలని, దీని ద్వారా దేశ ఖనిజ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

సింగరేణి సంస్థ ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉందని, ఇప్పుడు విదేశీ ఖనిజ బ్లాకులలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత వృద్ధి సాధించాలని పేర్కొన్నారు.

Next Story