కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజీనామాకు సిద్ధమైన సిద్ధరామయ్య

by Ajay Maddhiboyina |

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆయన తిరస్కరించినట్టు సమాచారం.

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజీనామాకు సిద్ధమైన సిద్ధరామయ్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఢిల్లీలో అధిష్టానంతో చర్చల అనంతరం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ సహా పలువురు కీలక నేతలు సమావేశం అయ్యారు. ముందు నుండి సీఎం మార్పు కోసమే ఈ సమావేశం జరుగుతుందని ప్రచారం జరిగినా.. సమావేశం తరవాత వేణుగోపాల్ దానిని ఖండించారు. రాజ్యసభ ఎన్నికల గురించి మాత్రమే చర్చ జరిగిందని చెప్పారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిద్ధరామయ్య రాజీనామా చేసేందుకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో చాలా కాలంగా సీఎం మార్పుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు డీకేకు డిప్యూటీ ఇచ్చి సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించారు. ఆ తరవాత చాలా సార్లు డీకే శివకుమార్ సీఎం కుర్చీపై కూర్చుంటారని ప్రచారం జరిగింది. అనేకసార్లు దీనిపై ఢిల్లీ వేదికగా సమావేశాలు కూడా జరిగాయి. సిద్దరామయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కుర్చీని అధిష్టించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటును తిరస్కరించిన సిద్ధరామయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కన్నడనాట ఉత్కంఠగా మారింది.

Next Story