140 కోట్ల మంది ఆశలు మోస్తున్నా.. చాలా గర్వంగా ఉంది: శుభాంశు శుక్లా

by Phanindra |

అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం చెప్పిన శుభాంశు శుక్లా. 140 కోట్ల మంది ఆశలు మోస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.

140 కోట్ల మంది ఆశలు మోస్తున్నా.. చాలా గర్వంగా ఉంది: శుభాంశు శుక్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వాయుసేనలో గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా అరుదైన ఘనత సాధించారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా నిలిచారు. గురువారం సాయంత్రం 4.01 గంటలకు యాక్సియం మిషన్-4 విజయవంతంగా ఐఎస్ఎస్‌తో డాకింగ్ పూర్తిచేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా శుక్లా అరుదైన ఘనత సాధించారు.

ఈ క్రమంలో డాకింగ్‌కు ముందు భావోద్వేగానికి గురైన శుక్లా.. ‘అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. 140 కోట్ల మంది ప్రజల ఆశలను రోదసిలోకి తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది’ అన్నారు. ‘ఇలా అంతరిక్షంలో తేలుత ఉండటం చాలా గొప్ప అనుభూతి. ఇది జరిగేలా చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది కేవలం నా ఒక్కడి అచీవ్‌మెంట్ కాదు. స్వదేశంలో ఎంతోమంది ఈ కలను పంచుకుంటేనే ఇది జరిగింది’ అని ఆయన చెప్పారు.

తన మొదటి అంతరిక్ష యాత్రలో అనుభవాలను పంచుకున్న శుక్లా.. ‘నేను ఇక్కడ మరీ ఎక్కువ నిద్రపోతున్నాను. జీరో గ్రావిటీకి ఇంకా అలవాటు పడుతున్నా. పసివాళ్లు నడక నేర్చుకున్నట్లు.. నా శరీరాన్ని కంట్రోల్ చేయడం, కదలడం నేర్చుకుంటున్నా. అయితే ప్రతిక్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నా. పొరబాట్లు చేసినా ఏం పర్లేదు. అదే టైంలో పక్కవాళ్లు పొరబాట్లు చేస్తుంటే చూడటం ఇంకా బాగుంటుంది. ఇప్పటి వరకైతే ఇది అసలు నమ్మశక్యం కాని ప్రయాణం. ఇంకా ఇది ముగియలేదు. తర్వాతి దశ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

60కి పైగా ప్రయోగాలు..

యాక్సియం-4లో ఐఎస్ఎస్‌కు వెళ్లిన క్రూ.. అక్కడ 14 రోజులు ఉంటుందని నాసా వెల్లడించింది. అక్కడ కొన్ని సైంటిఫిక్ ప్రయోగాలు చేస్తారని, అలాగే ఇంటర్వ్యూలు ఇవ్వడంతోపాటు అవుట్‌‌రీచ్ కార్యకలాపాల్లో భాగంగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ క్రూ.. ఎక్స్‌పెడిషన్ 73 క్రూతో కలిసి 60కి పైగా సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్లు చేయనున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ అవుట్‌రీచ్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇదే యాక్సియం మిషన్‌ ఎజెండాలో చాలా ముఖ్యమైన విషయమని సమాచారం.

Next Story