మీ ఆశీస్సులతోనే ఇక్కడకు వచ్చా.. దేశ ప్రజలకు సందేశం పంపిన శుభాంశు

by Phanindra |

ఐఎస్ఎస్‌లో అడుగు పెట్టిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా. భారతీయులకు సందేశం పంపుతూ.. అందరి ఆశీస్సులతోనే ఇక్కడకు వచ్చానన్నారు.

మీ ఆశీస్సులతోనే ఇక్కడకు వచ్చా.. దేశ ప్రజలకు సందేశం పంపిన శుభాంశు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా తన అనుభవాన్ని వర్ణించారు. కెమెరాలో చూసేందుకు సులభంగా ఉన్నా, ఐఎస్‌ఎస్‌లోకి వచ్చే సమయంలో తనకు తలభారంగా అనిపించిందన్నారు. యాక్సియం-4 క్రూను ఆహ్వానించిన స్పేస్ సెంటర్ టీం.. శుభాంశును ‘ఆస్ట్రోనాట్ 634’గా గుర్తించారు. ఆయనకు స్పేస్ స్టేషన్ పిన్‌ కూడా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శుభాంశు.. వచ్చే రెండు వారాలు అద్భుతంగా ఉండబోతున్నాయన్నారు. భూమిని ఇలాంటి గొప్ప స్థానం నుంచి వీక్షించిన అతికొద్ది మందిలో తను చేరడం చాలా గొప్ప విషయమని సంతోషం వ్యక్తంచేశారు.

‘నేను దీని కోసం చాలా ఎదురు చూశా. క్రూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను అనుకున్న దాని కన్నా ఈ ఫీలింగ్ ఎన్నో రెట్లు గొప్పగా ఉంది. దీనికి కారణం ఈ క్రూ అనే చెప్పాలి. వచ్చే 14 రోజులు చాలా ఎగ్జయిటింగ్‌గా, గొప్పగా ఉండబోతున్నాయి’ అని శుభాంశు అన్నారు. అలాగే భారతీయులకు సందేశం పంపిన ఆయన.. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇది తొలి అడుగేనన్నారు. వచ్చే 14 రోజుల్లో చాలా సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుందని చెప్పారు.

‘మీ ప్రేమ, ఆశీస్సులతో నేను స్పేస్ స్టేషన్ చేరుకున్నాను. ఇక్కడ నిలబడి ఉండటం ఈజీగా కనిపిస్తుంది కానీ.. నా తల ఇంకా భారంగానే అనిపిస్తోంది. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ఇది మొదటి దశ. ఇక తర్వాత మేం చాలా సైన్స్ స్టడీస్ చేస్తాం. ఈ ప్రయాణాన్ని ఎగ్జయిటింగ్‌గా మారుద్దాం. నేను త్రివర్ణ పతాకాన్ని మోస్తున్నాను. అంటే మీ అందర్నీ నాతో తీసుకొచ్చినట్లే’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే ఐఎస్ఎస్‌లో ఉన్న ఎక్స్‌పెడిషన్ 73 సిబ్బందితో కలిసి 60కి పైగా ప్రయోగాలు చేస్తుందీ యాక్సియం-4 క్రూ. వీటిలో కేన్సర్ రీసెర్చ్, డీఎన్‌ఏ రిపెయిర్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫాక్చరింగ్‌కు ఉపయోగపడే ప్రయోగాలతోపాటు అంతరిక్ష ప్రయాణాల్లో కమర్షియల్-అంతర్జాతీయ భాగస్వామ్యం గురించి కూడా వీరు చర్చిస్తారు.

Next Story