షాకింగ్ ఘటన.. నవరాత్రి వేడుకల్లో పాల్గొనలేదని వివాహిత సూసైడ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-05 09:20:46  IST  )

పీరియడ్స్ (ఋతుస్రావం).. మహిళల్లో జరిగే సాధారణ, సహజమైన జీవ ప్రక్రియ.

షాకింగ్ ఘటన.. నవరాత్రి వేడుకల్లో పాల్గొనలేదని వివాహిత సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్: పీరియడ్స్ (ఋతుస్రావం).. మహిళల్లో జరిగే సాధారణ, సహజమైన జీవ ప్రక్రియ. ఇది గర్భధారణకు సిద్ధం కావడానికి ప్రతి నెలా జరిగే మార్పుల శ్రేణి. 21వ రోజు నుంచి 35 రోజుల మధ్యలో మహిళలకు ఎప్పుడైనా పీరియడ్స్ రావొచ్చు. అయితే, మన దేశంలో పీరియడ్స్ వచ్చిన ఆడవారితో ఆ ఐదు రోజుల పాటు ఎలాంటి పనులు చేయనివ్వరు. ముఖ్యంగా దైవ సంబంధిత కార్యక్రమాల్లో అస్సలు పాల్గొననివ్వరని అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆచారమే ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన నవరాత్రి వేడుకల్లో పీరియడ్స్ కారణంగా పాల్గొనలేకపోతున్నాననే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే..

యూపీలోని (Uttarpradesh) ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని అనే 36 ఏళ్ల మహిళ.. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఛైత్ర మాసంలో వచ్చే నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్‌తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.

అయితే, నవరాత్రులు ప్రారంభమయ్యే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చాయి. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఎంతో ఇష్టమైన దేవి నవరాత్రులు జరుపుకోలేకపోవటం ఆమె తట్టుకోలేకపోయింది. భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, పీరియడ్స్‌ను అవమానంగా భావించి చనిపోయిన వారిలో ప్రియాంషా సోని మొదటి వ్యక్తి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ముంబైలో ఓ 12 ఏళ్ల అమ్మాయి కూడా పీరియడ్స్ వల్ల తనను అవమానించారని ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే, తమిళనాడులో 14 ఏళ్ల మరో అమ్మాయి బలవన్మరణం పొందింది. అందుకు కారణం తరతరాలుగా మన దేశంలో పీరియడ్స్‌ను అపవిత్రంగా భావించటం. చాలా చోట్ల మహిళలను ఒంటరిగా ఉంచే ఆచారం కూడా ఉంది. నిజానికి ఆ సమయంలో మహిళలు కాస్తా బలహీనంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఎలాంటి పనులు చెప్పకపోయే వారు. కానీ కాలక్రమేణా దాన్ని అపవిత్రంగా చూడటం ప్రారంభమైంది. అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story