ఒళ్లు గగుర్పొడిచే ఘటన: రైలు పైకెక్కి హైవోల్టేజ్ కరెంట్ తీగను పట్టుకున్న యువకుడు.. వైరల్

by Ramesh Naini |

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్‌గా మారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది.

ఒళ్లు గగుర్పొడిచే ఘటన: రైలు పైకెక్కి హైవోల్టేజ్ కరెంట్ తీగను పట్టుకున్న యువకుడు.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్‌గా మారి అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. బీహార్‌లోని దర్భంగాలో ఒక యువకుడు గూడ్స్ రైలు పైకెక్కి, ప్రమాదవశాత్తు ఓవర్‌హెడ్ విద్యుత్ తీగను పట్టుకుని ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకరమైన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. వైరల్ వీడియో, వార్తా నివేదికల ప్రకారం.. గుర్తు తెలియని ఒక యువకుడు గూడ్స్ రైలు బోగీ పైకి ఎక్కాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు కిందకు దిగిపోవాలని ఎంతగా కేకలు వేసి వారిస్తున్నా అతడు పట్టించుకోలేదు. వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, అత్యంత ప్రమాదకరమైన రీతిలో రైలు పైభాగంలో నడుస్తూ తన చేతులను విద్యుత్ తీగలకు సమీపంగా తీసుకెళ్లాడు. మరుక్షణంలోనే ఆ యువకుడు హైవోల్టేజ్ కరెంటు తీగను పట్టుకోవడంతో భారీ పేలుడు లాంటి శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు (స్పార్క్) చెలరేగాయి. ఆ భయానక దృశ్యాన్ని చూసి కింద ఉన్నవారంతా భయంతో హాహాకారాలు చేశారు. విద్యుత్ ఘాతానికి గురైన ఆ యువకుడు క్షణాల్లోనే బోగీపై కుప్పకూలిపోయాడు.

ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. తీవ్రమైన కరెంటు షాక్ తగలడం వల్లే అతను ఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ యువకుడు మానసిక స్థిమితం లేనివాడై ఉండొచ్చని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

Next Story