- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. వీసా ఫీజులు పెంచిన అమెరికా
అమెరికా వెళ్లాలనుకునే వారికి ట్రంప్ సర్కార్ బిగ్ షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా (America) వెళ్లాలనుకునే వారి కలలకు ట్రంప్ ప్రభుత్వం షాకింగ్ బ్రేక్ వేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రవేశపెట్టిన కొత్త 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' కింద, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు సుమారు రూ.21,000 వీసా ఇంటిగ్రిటీ ఫీజు విధిస్తుంది. 2026 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ అయిన ఫ్రాగోమెన్ నివేదిక ప్రకారం.. ప్రతి ఏటా వీసా ఇంటిగ్రిటీ ఫీజు పెంచుకునేలా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS)కి ట్రంప్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం కానీ, రద్దు చేయడం కానీ ఉండదు. డిప్లొమాటిక్ వీసాలు (A, G), కొన్ని ఇతర ప్రత్యేక వీసాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే H4 వంటి డిపెండెంట్ వీసాలకు ఈ ఫీజు వర్తిస్తుందా, లేదా అనేదానిపై స్పష్టత లేదు.
ఇక ఈ నిర్ణయం భారతీయ స్టూడెంట్లు, టూరిస్టులు, H1B వీసాదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్న స్టూడెంట్లకు ఇది మరో భారం. తాము అమెరికాలో ఉన్న పిల్లల్ని చూసేందుకు బయలుదేరే తల్లిదండ్రులకు, బంధువులను కలవాలనుకునే కుటుంబ సభ్యులకు ఇది నిజమైన ఆర్థిక భారంగా మారనుంది. బీ2 టూరిస్ట్ వీసా ఖర్చు ఇప్పుడు సుమారు రూ.15 వేలు ఉంటే.. దీనికి అదనంగా వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద రూ.21 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చు సుమారు రూ.35 వేల వరకు ఉండనుంది. 2025లో హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850 నుంచి ఏకంగా సుమారు రూ.21వేలకు పెరిగింది. ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల 2026 కోసం హెచ్1బీ దరఖాస్తుల సంఖ్య చాలా తగ్గింది.
ఇక వీసా ఇంటిగ్రిటీ ఫీజును కొన్ని షరతులతో రీ ఫండ్ చేస్తారు. వీసా హోల్డర్ అమెరికాలో ఉన్న టైమ్‌లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే.. ఈ ఫీజు రీఫండ్ చేసే అవకాశం ఉంది. ఐ-94 గడువు ముగియడానికి 5 రోజుల కన్నా ముందుగానే అమెరికాను విడిచి వెళ్లేవారికి, ఐ-94 గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగింపు, శాశ్వత నివాస అనుమతి పొందినవారికి ఫీజును తిరిగి చెల్లించొచ్చు.
వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టింది. అలాగే, ఈ ఫీజు ద్వారా అమెరికా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సేకరించాలని యోచిస్తుంది. ఇది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఖర్చులు భరించడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఇది ఎంతోమందికి అమెరికా ప్రయాణాన్ని కల నుంచి భారంగా మార్చే అవకాశం కనిపిస్తోంది.






