ఓటీటీలకు షాక్.. ఆ యాప్‌లను నిషేధించిన కేంద్రం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-25 09:29:51  IST  )

పలు ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

ఓటీటీలకు షాక్.. ఆ యాప్‌లను నిషేధించిన కేంద్రం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై భారీ చర్యలకు పాల్పడింది. వివాదాస్పదంగా, అశ్లీలతతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఉల్లు (Ullu), ఆల్ట్ (ALTT), దేశీఫ్లిక్స్ (Desiflix), బిగ్ షాట్స్ (Big Shots) సహా 25 ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా వెబ్‌సైట్లను కన్పించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఓటీటీ ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్‌ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ఈ ప్లాట్‌ఫారమ్‌ల్లోని కంటెంట్ భారతీయ సాంస్కృతిక విలువలకు విరుద్ధంగా ఉందని, మహిళలను అశ్లీలంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ యాప్‌లు 'సాఫ్ట్ పోర్న్' కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు నిర్ధారణ కావడంతోనే ఐటీ చట్టం (సెక్షన్ 67, 67A), ఐపీసీ సెక్షన్ 292, మహిళల అసభ్య ప్రాతినిధ్యం నిషేధం చట్టం (1986) ప్రకారం చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఇలా చర్యలకు పాల్పడటం మొదటిసారి కాదు. గతేడాది మార్చిలో కూడా కేంద్రం 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌లు (గూగుల్ ప్లేలో 7, ఆపిల్ స్టోర్‌లో 3), 57 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది. అశ్లీలత, అసభ్యత కలిగిన కంటెంట్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. త్వరలో బహుళ నియంత్రణలతో కూడిన కొత్త ప్రసార చట్టం అమల్లోకి వచ్చే అవకాశముంది.

తొలగించిన యాప్స్‌, వెబ్‌సైట్స్‌ ఇవే..

ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్‌, బిగ్‌ షాట్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో, షోఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్‌ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌.

Next Story