స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాక్.. త్వరలో బాధుడు తప్పేలా లేదు!

by Prasad Jukanti |

ఇంధన ధరల పెంపుతో స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల ధరలు పెరగనున్నాయి. ప్లాట్‌ఫారమ్ ఫీజుల పెంపునకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాక్.. త్వరలో బాధుడు తప్పేలా లేదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇంధన ధరల మంటలు సామాన్యులపై భారం భారంగా మారుతోంది. బ్యాక్ టు బ్యాక్ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు గిగ్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ భారం త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారికి మరింత భారంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ బ్రోకరేజ్ సంస్థ 'ఎలారా క్యాపిటల్' (Elara Capital) తాజా నివేదిక ప్రకారం ఇకపై మీరు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) లో ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, తద్వారా పెరుగుతున్న ఇంధన (Fuel) ధరలే దీనికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇదే జరిగితే జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్ ఫారమ్ లపై ఆర్డర్లు మరింత ఖరీదైనవిగా మారి వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి.

సగటున రూ.55-60

ఎలారా క్యాపిటల్ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆన్‌లైన్ కంపెనీలకు ఒక ఆర్డర్‌పై అవుతున్న సగటు డెలివరీ ఖర్చు క్విక్ కామర్స్ (బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ మొదలైనవి) ఒక ఆర్డర్‌కు సగటున రూ.35 నుండి రూ.50 వరకు ఖర్చవుతుండగా ఫుడ్ డెలివరీ ఒక ఆర్డర్‌కు సగటున రూ.55 నుండి రూ.60 వరకు ఖర్చవుతుంది. మొత్తం డెలివరీ ఖర్చులో ఇంధనం (పెట్రోల్) వాటా దాదాపు 20 శాతంగా ఉంటుంది. అంటే సగటున ఒక ఆర్డర్‌కు రూ.9 నుండి రూ.10 వరకు కేవలం ఇంధనం కోసమే వ్యయమవుతోంది. ఇటీవల ఇంధన ధరల పెంపు వల్ల ఫుడ్ డెలివరీ కంపెనీలకు ప్రతి ఆర్డర్‌పై సుమారు రూ. 0.44 అదనపు భారం పడుతుందని అంచనా. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలపై డెలివరీ ఏజెంట్స్ ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చే కమిషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూరున్నారు. తమ కమిషన్లు పెంచకపోతే ఈ రంగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందని గిగ్ వర్కర్లు హెచ్చరిస్తున్నారు.

నష్టాన్ని పూడ్చే పని:

డెలివరీ భాగస్వాముల నుంచి వస్తున్న ఒత్తిడి, ఇంధన ధరల భారంతో కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఈ అదనపు ఖర్చులను కస్టమర్లపైనే నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ కంపెనీల ఆదాయాలపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ.. డెలివరీ ఛార్జీలను, ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచడం ద్వారా మరి కొద్ది రోజుల్లో కంపెనీలు ఈ నష్టాన్ని పూడ్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ డెలివరీల కోసం మున్ముందు అదనపు బాదుడు తప్పేలా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

స్విగ్గీ కంటే జొమాటోకే అడ్వాంటేజ్!

ఇంధన ధరల వల్ల వచ్చే ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడంలో స్విగ్గీ కంటే జొమాటో (Eternal) మెరుగైన స్థితిలో ఉందని ఎలారా క్యాపిటల్ పేర్కొంది. జొమాటో కస్టమర్లు ఎక్కువ శాతం ప్రీమియం విభాగాలకు చెందినవారు కావడంతో ధరల పెరుగుదలను పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్లాట్‌ఫారమ్ ఫీజు లేదా హ్యాండ్లింగ్ ఛార్జీలను పెంచి ఆ భారాన్ని కస్టమర్ల నుండి వసూలు చేయడం జొమాటోకు సులువు అవుతుంది. అంతేకాకుండా, జొమాటోకు యాడ్స్ (Ad Revenue) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే ఉంది. కానీ స్విగ్గీ కస్టమర్లు ధరల విషయంలో కాస్త సున్నితంగా ఉంటారు. (Price-sensitive). అలాగే క్విక్ కామర్స్ విభాగంలో స్విగ్గీ ఇంకా లాభాల్లోకి రావాల్సి ఉంది (Break-even). అందువల్ల పెరిగిన ఇంధన ధరల ప్రభావం స్విగ్గీపైనే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story