విమాన ప్రయాణికులకు షాక్.. 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం వెనక్కి!

by Kema Shiva Kumar |

విమాన ప్రయాణికులకు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్లైట్లలో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఉత్తర్వులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

విమాన ప్రయాణికులకు షాక్.. 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం వెనక్కి!
X

దిశ, వెబ్‌డెస్క్: విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చేలా విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలన్న ఉత్తర్వులను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Union Ministry of Civil Aviation) తాత్కాలికంగా నిలిపివేసింది. సాధారణంగా విమానాల్లో నచ్చిన సీటును ఎంచుకోవాలంటే ప్రయాణికులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, ప్రభుత్వం స్పందించి ప్రతి విమానంలో 60 శాతం సీట్లను ఉచితంగా అందుబాటులో ఉంచాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది. మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని సూచించింది.

ఎయిర్‌లైన్స్ సంస్థల అభ్యంతరం..

ప్రభుత్వ నిర్ణయంపై విమానయాన సంస్థల సమాఖ్య (Federation of Airlines), ఆకాశ ఎయిర్ (Akasa Air) వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 60 శాతం సీట్లను ఉచితంగా ఇస్తే తమ ఆదాయం భారీగా తగ్గుతుందని, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతాయని ఎయిర్‌లైన్స్ వాదించాయి. ఈ నిబంధనలతో టికెట్ ధరల రూపకల్పనలో సమతుల్యత దెబ్బతింటుందని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ క్రమంలోనే ఎయిర్‌లైన్స్ విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుల అమలును ప్రస్తుతానికి పక్కన పెట్టింది. దీనిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు పాత నిబంధనలే అమలులో ఉంటాయి. అంటే, విమానాల్లో కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా లభించే అవకాశం ఉంది. మిగిలిన సీట్లకు ఎయిర్‌లైన్స్ నిర్ణయించిన ధరల ప్రకారం ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.

Next Story