- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
90 ఏళ్ల వయసులో వృద్ధురాలు మొండిపట్టు.. ఊహించని షాకిచ్చిన కోర్టు
పరువు నష్టం దావా కేసులో మొండిగా వ్యవహరించిన 90 ఏళ్ల బామ్మకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు విచారణను 2046కు వాయిదా వేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పరువు నష్టం దావా కేసులో రాజీకి రావాలన్నా వినకుండా మొండి పట్టు పట్టిన 90 ఏళ్ల వృద్ధురాలికి బాంబే హైకోర్టు షాకిచ్చింది. మరో 20 ఏళ్ల తర్వాత ఈ కేసు విచారిస్తామని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విషయంలో జస్టిస్ జితేంద్ర జైన్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది వాస్తవమైన సమస్య కంటే కేవలం ఇద్దరి మధ్య ఉన్న అహంకారాల పోరాటం (Battle of Egos) అని అభివర్ణించారు. అందరిని ఆశ్చర్యపడేలా హైకోర్టు నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా పద్ద కథే నడిచింది. 2015లో శ్యామ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల తనకు తీవ్ర మానసిక వేదన కలిగిందని, తన పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ తారిణీబెన్ (90), ధ్వని దేశాయ్ (57) అనే మహిళలు 2017లో కిల్‌కిల్‌రాజ్ భన్సాలీ, ఇతర వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీని కోసం వారు రూ. 20 కోట్ల పరిహారం కోరారు.
ఎంత చెప్పినా వినని వృద్ధురాలు:
తారిణీబెన్, ధ్వని దేశాయ్ పిటిషన్లపై గతంలో విచారించిన కోర్టు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇద్దరూ క్షమాపణలు చెప్పుకుని కేసును ముగించుకోవాలని తెలిపింది. కానీ 90 ఏళ్ల తారిణీబెన్ మాత్రం తన పరువు నష్టం దావాను కొనసాగిస్తానని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మొండిగా వ్యవహరించారు. కోర్టు చెప్పినా తారిణీబెన్ రాజీకి రాకపోవడం పట్ల ఇవాళ విచారణ సందర్భంగా జస్టిస్ జితేంద్ర జైన్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తుల మధ్య నడుస్తున్న ఈ అహంకారాల పోరాటం వల్ల న్యాయ వ్యవస్థ స్తంభించిపోతోంది. దీనివల్ల నిజంగా ప్రాధాన్యత కలిగిన ఇతర కేసులను కోర్టు విచారించలేకపోతోంది అని వ్యాఖ్యానించింది.
2046 తర్వాత మాత్రమే విచారణ:
పిటిషనర్ వయసు 90 ఏళ్లు (సూపర్ సీనియర్ సిటిజన్) అయినంత మాత్రాన ఈ కేసుకే ప్రాధాన్యత ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంపై ఇక ఏమీ చెప్పదలచుకోలేదు. ఈ కేసును రాబోయే 20 ఏళ్ల వరకు కోర్టు విచారణ చేపట్టదు. 2046 తర్వాత మాత్రమే విచారణకు స్వీకరించాలని ఆదేశించారు.గత సంవత్సరం మార్చిలో, తదుపరి విచారణకు పిటిషనర్ తరఫు న్యాయవాది హాజరు కాకపోతే కేసు కొట్టివేయబడుతుందని మరో ధర్మాసనం హెచ్చరించింది. 2019లో కూడా, సాక్షుల జాబితా మరియు సంబంధిత పత్రాలను సమర్పించడానికి కోర్టు వాదులకు సమయం ఇచ్చింది; అయినప్పటికీ, వివాదం పరిష్కారం కాకపోగా, అది కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో కూడా ఈ కేసులో వాదులు సరైన పత్రాలు సమర్పించడంలో, హాజరు కావడంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసే ఇలాంటి కేసులకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






