Shiva kumar: ప్రాంతీయ పార్టీలను అంతం చేయడమే ‘జమిలీ’ లక్ష్యం.. డీకే శివకుమార్

by vinod kumar |
Shiva kumar: ప్రాంతీయ పార్టీలను అంతం చేయడమే ‘జమిలీ’ లక్ష్యం.. డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One nation one election) ప్రతిపాదనను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Shva kumar) తిరస్కరించారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయడానికే బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘అనేక ప్రాంతీయ పార్టీల కారణంగా ఇండియా కూటమి బలం పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), సమాజ్ వాదీ పార్టీ (SP) కమ్యూనిస్టు పార్టీ(Communist party) లను జమిలీ ఎన్నికల ద్వారా అంతం చేసేందుకు కాషాయపార్టీ ప్రయత్నిస్తోంది’ అని ఆరోపించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ఆమోదించడానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని తెలిపారు.

‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకించింది. బిల్లు పాస్ అవ్వడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. పార్లమెంటులో బిల్లును ఆమోదించడానికి ఎన్డీయేకు బలం లేదు. మరికొన్ని రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిని ఎలా నిర్వహిస్తారు’ అని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఇటీవల కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 16న బిల్లును పార్లెంటులో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed