Shekhar Yadav: మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకే దేశం పని చేస్తుంది.. అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్

by vinod kumar |
Shekhar Yadav: మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకే దేశం పని చేస్తుంది.. అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: మెజారిటీ ప్రజల ఆకాంక్షల మేరకే దేశం పని చేస్తుందని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ (Shekar kumar Yadav) అన్నారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఏ మాత్రం సంకోచించడం లేదన్నారు. న్యాయస్థానంలోని లైబ్రరీ హాల్‌లో హిందుత్వ సంస్థ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) లీగల్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో ‘యూసీసీ- ఏ కాన్ స్టిట్యూషనల్ ఇంపరేటివ్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారతదేశంలో లౌకికవాదం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉందన్నారు. ‘ఇది హిందుస్థాన్ అని చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. ఈ దేశం హిందుస్థాన్‌లో నివసిస్తున్న మెజారిటీ ప్రజల కోరిక మేరకు నడుస్తుంది. చట్టం కూడా మెజారిటీ ప్రకారమే నడుస్తోంది. మెజారిటీ ప్రజల సంక్షేమానికి, సంతోషానికి ఉపయోగపడేవి మాత్రమే ఇక్కడ అంగీకరించబడతాయి’ అని వ్యాఖ్యానించారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) సమానత్వం, న్యాయం అనే సూత్రాలపై ఆధారపడి ఉందని, ఇది దేశానికి ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా యూసీసీ ఎంతో అవసరమని అభివర్ణించారు. మతం పేరుతో జరుగుతున్న సామాజిక అసమానతలను తొలగించడానికి దీనిని అమలు చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. శాస్త్రాలు, వేదాలు వంటి హిందూ గ్రంధాలలో స్త్రీలను దేవతలుగా గౌరవిస్తున్నప్పటికీ, ఒక సమాజంలోని సభ్యులు ఇప్పటికీ బహుళ భార్యలను కలిగి ఉన్నారని, హలాల్‌లో పాల్గొనడం, ట్రిపుల్ తలాక్‌ను ఆచరించే హక్కును కలిగి ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరొక న్యాయమూర్తి జస్టిస్ దినేష్ పాఠక్, ప్రభుత్వ న్యాయవాది ఎకె సాండ్, అలహాబాద్‌లోని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ అలాగే పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు హాజరయ్యారు. అయితే వీహెచ్ పీ కార్యక్రమానికి న్యాయమూర్తులు హాజరుకావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కాగా, శేఖర్ కుమార్ యాదవ్ 2021లోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో గోహత్య నిరోధక చట్టం కింద ఒక వ్యక్తికి బెయిల్ నిరాకరించిన ఆయన.. ఆవు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని, దానిని జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed