'Sheeshmahal' row: కేజ్రీవాల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

by Shamantha N |

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనం పునరుద్ధరణలో అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) విచారణకు ఆదేశించింది.

Sheeshmahal row: కేజ్రీవాల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనం పునరుద్ధరణలో అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత, రోహిణి ఎమ్మెల్యే విజయేంద్ర గుప్తా ఢిల్లీ సీఎం అధికారిక బంగ్లా నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. శీష్ మహల్ పై విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంపై 2024 అక్టోబర్ 14న శీష్ మహల్ పై విజేంద్ర గుప్తా సీవీసీకి ఫిర్యాదు చేశారు. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో శీష్ మహల్ నిర్మించడానికి కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై 2024, అక్టోబర్‌ 16న సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది. సమగ్ర నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చింది.

శీష్ మహల్ పై ఫిర్యాదు

అయితే, ఈనెల 13న సీవీసీ శీష్ మహల్ కు సంబంధించిన నివేదికను పరిశీలించింది. ఆ తర్వాత ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నివాసం, దాని పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్ కోసం జరిగిన వృథా ఖర్చుపై దర్యాప్తు చేయనుంది. ఢిల్లీ మాజీ సీఎం అధికార నివాసానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ నేత విజయేంద్ర గుప్తా ఆరోపించారు. శీష్‌ మహల్‌ని ఆధునీకరిస్తూ, టాయిలెట్‌లో గోల్డెన్‌ కమోడ్‌, స్విమ్మింగ్‌పూల్‌, మినీ బార్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ఈ బంగ్లాను ఆధునికీకరించడంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించారు.

Next Story