Shashi Tharoor: నన్ను ఎవరూ అమానించలేరు.. నా విలువ నాకు తెలుసు-

by Shamantha N |   (  Updated:2025-05-18 10:11:30  IST  )

ఉగ్రవాదంపై పాక్ కు వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లే అఖిల పక్ష బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించనున్నారు.

Shashi Tharoor: నన్ను ఎవరూ అమానించలేరు.. నా విలువ నాకు తెలుసు-
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై పాక్ కు వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లే అఖిల పక్ష బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించనున్నారు. అయితే, కేంద్రం ఆహ్వానాన్ని అంగీకరించాలనే తన నిర్ణయంపై థరూర్ స్పందించారు. తిరువనంతపురంలో థరూర్ మీడియాతో మాట్లాడారు. ప్రతినిధి బృందానికి కాంగ్రెస్ సూచించిన పేర్ల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. అది పార్టీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విషయమన్నారు. అయితే, ప్రతినిధి బృందం కోసం పార్టీ సూచించిన పేర్లను విడుదల చేసి తనను పార్టీ అవమానించడానికి ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నపైనా ఆయన స్పందించారు. తనను అంత తేలికగా ఎవరూ అవమానించలేరని.. తన విలువ తనకు తెలుసని అన్నారు. కేంద్రప్రభుత్వం దేశం కోసం తన సేవను కోరిందని, దానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. "జాతీయ సేవ ప్రతి పౌరుడి విధి" అని అన్నారు. దేశంపై దాడి జరిగినప్పుడు, "మనమందరం ఐక్యంగా నిలబడటం దేశానికి మంచిది అని నా అభిప్రాయం" అని థరూర్ అభిప్రాయపడ్డారు.

గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే..

విదేశాంగ వ్యవహారాలను నిర్వహించడంలో తన గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఇటీవలే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించమని తనని కోరినట్లు థరూర్ తెలిపారు. వెంటనే దానికి తాను అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. "ఇందులో నాకు ఎటువంటి రాజకీయాలు కనిపించడం లేదు. నా అభిప్రాయం ప్రకారం, ఒక దేశంలో రాజకీయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కానీ, మనమందరం భారతీయులం. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రం పౌరుడి సాయం కోరితే.. అందుకు ఒప్పుకోక వేరే సమాధానమేమి ఇస్తారు" అని థరూర్ అన్నారు. పాకిస్థాన్‌తో 88 గంటల పాటు జరిగిన యుద్ధాన్ని అందరూ చూశారని థరూర్ చెప్పుకొచ్చారు. అందుకే, ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉందా? ప్రతినిధి బృందం కోసం సూచించిన వ్యక్తుల పేర్లను ఎందుకు విడుదల చేసిందో అనే ప్రశ్నకు కూడా థరూర్ బదులిచ్చారు. ఆ విషయం కాంగ్రెస్ అధిష్ఠానాన్నే అడగాలన్నారు. అంతేకాకుండా, రిజిజు తనను సంప్రదించిన వెంటనే ఆ విషయాన్ని పార్టీకి తెలిపానన్నారు.

Next Story