‘ఆపరేషన్ సిందూర్’ తప్పనిసరి.. యుద్ధకాంక్ష భారత్‌కు లేదు: శశిథరూర్

by Phanindra |

ఆపరేషన్ సిందూర్ తప్పనిసరి అని, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనే ఆలోచన భారత్‌కు లేదని శశిథరూర్ స్పష్టం చేశారు.

‘ఆపరేషన్ సిందూర్’ తప్పనిసరి.. యుద్ధకాంక్ష భారత్‌కు లేదు: శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతును ఎండగట్టేందుకు శశిథరూర్ నేతృత్వంలోని దౌత్య బృందం యూఎస్ వెళ్లింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్‌’పై ప్రశంలు కురిపించారు. తాను ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. పాకిస్తాన్‌ను బలంగా, అదే సమయంలో తెలివిగా దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చిందని, భారత్ అదే చేసిందని తేల్చిచెప్పారు. మే 7వ తేదీన భారత దళాలు చాలా కచ్చితత్వంతో దాడులు చేసి 9 టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశాయని చెప్పారు. పాకిస్తాన్‌తో వ్యవహారాల్లో కొత్త గీత గీయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌కు సంబంధించిన వ్యవహారాల్లో అంతర్జాతీయ ఫిర్యాదులు, వివరణలు, అన్నీ ప్రయత్నించామని థరూర్ చెప్పారు. కానీ పాక్ మాత్రం మొండిగా వీటన్నింటినీ తిరస్కరించిందని, ఉగ్రవాదులకు సహకారం అందించడాన్ని మానుకోలేదన్నారు.

‘ఆపరేషన్ సిందూర్’ చాలా కచ్చితమైన మిషన్ అని, తమకు పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనే ఆకాంక్ష లేదని థరూర్ స్పష్టంచేశారు. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. యుద్ధం చేయాలనే ఆలోచన మాకు లేదు’ అని ఆయన తెలియజేశారు. భారత భూభాగాలను ఆక్రమించుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోందని, దాని కోసం ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు.

Next Story