Sharad: సీజ్ ఫైర్‌పై పార్లమెంటులో చర్చించొద్దు.. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

by B.Srinivas |

కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Sharad: సీజ్ ఫైర్‌పై పార్లమెంటులో చర్చించొద్దు.. ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) తర్వాత భారత్ పాక్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) ఈ విషయంలో భిన్న స్వరం వినిపించారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని పార్లమెంటులో బహిరంగంగా చర్చించడం మంచిది కాదని తెలిపారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్‌కు బదులుగా అఖిల పక్ష భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ సీజ్ ఫైర్ సున్నితమైన, తీవ్రమైన విషయం. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని ఉభయసభల్లో చర్చించడం సాధ్యం కాదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సమాచారాన్ని గోప్యంగా ఉంచడం అవసరం. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా అఖిలపక్ష మీటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది’ అని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు దీనిపై చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు.

భారత్ పాక్ చర్చలకు అమెరికా మధ్య వర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వాదనలపై శరద్ పవార్ స్పందిస్తూ.. దేశీయ సమస్యల్లో ఇప్పటి వరకు మూడో దేశం జోక్యం చేసుకోవడాన్ని ఎప్పుడూ అనుమతించలేదని తెలిపారు. రెండు దేశాల అంతర్గత విషయాలపై ట్రంప్ మాట్లాడటం సరికాదని చెప్పారు. కాగా, కాల్పుల విరమణ ప్రకటన తర్వాత, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు వీలైనంత త్వరగా పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Next Story