ఏడేళ్ల పాప అగ్నికి ఆహుతి.. బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ గ్రూపుల దాడిలో మృతి

by Phanindra |

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ గ్రూపుల దాడిలో ఏడేళ్ల పాప అగ్నికి ఆహుతైంది. బీఎన్‌పీ నేత ఇంటిపై దాడిలో ఇది జరిగింది.

ఏడేళ్ల పాప అగ్నికి ఆహుతి.. బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ గ్రూపుల దాడిలో మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన బిలాల్ హుస్సేన్ అనే నాయకుడి ఏడేళ్ల కుమార్తెకు నిప్పుపెట్టారు. ఈ దారుణమైన ఘటన లక్ష్మిపూర్‌లోని హుస్సేన్ ఇంట్లోనే జరిగిందని సమాచారం. అర్ధరాత్రి ఒంటిగంటలకు హుస్సేన్ ఇంటిని చుట్టుముట్టిన ర్యాడికల్ గ్రూపులు.. ఆ ఇంటి బయట గొళ్లాలు పెట్టి, ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ దాడిలో హుస్సేన్ ఏడేళ్ల కుమార్తె ఆయేషా అక్తర్ దుర్మరణం పాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మిగతా వారిని తాము కాపాడగలిగామని వారు తెలిపారు. ఈ దాడిలో హుస్సేన్, ఆయన కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14) తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అమ్మాయిలిద్దర్నీ ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.

ఉస్మాన్ హాదీ మృతితో హింసాకాండ

బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలో హింసాత్మక ఘటనలు పెచ్చుమీరాయి. డిసెంబరు 18న మసీదులో నమాజ్ చేసి బయటకొస్తున్న అతనిపై.. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హాదీ.. సింగపూర్‌లో చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఈ విషయం తెలిసిన తర్వాత రెచ్చిపోయిన ర్యాడికల్ గ్రూపులు.. పలు మీడియా సంస్థలు, ఆ దేశ వ్యవస్థాపకుడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఇంటిపై కూడా దాడులు చేశారు. హాదీ మరణానికి న్యాయం కావాలంటూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.

Next Story