- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోపాల్ ఐష్‌బాగ్ బ్రిడ్జ్‌లో భద్రతా లోపం : ఎనిమిది మంది ఇంజినీర్ల సస్పెన్షన్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ఐష్‌బాగ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎనిమిది మంది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ఐష్‌బాగ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎనిమిది మంది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.
ఈ ఆర్ఓబీ నిర్మాణంలో ఉన్న ప్రమాదకరమైన 90 డిగ్రీల మలుపు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల మధ్య భయాందోళన ఏర్పడింది. దీనిపై స్పందించిన సీఎం యాదవ్ శనివారం రాత్రి ‘X’లో పోస్టు చేస్తూ దోషాన్ని గమనించిన వెంటనే దర్యాప్తు జరిపించానని, అందులో వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నానన్నారు. ఏడుగురు ఇంజినీర్లు, ఇద్దరు చీఫ్ ఇంజినీర్లను తక్షణమే సస్పెండ్ చేయగా.. ఒక రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఒక వైపు U ఆకార మలుపు ఉండగా, మరోవైపు ప్రమాదకరమైన 90 డిగ్రీల మలుపు ఉంది. ఈ డిజైన్ తారతమ్యం అనేక విమర్శలకు తావిచ్చింది. నిపుణులు చెబుతునట్లు, సాధారణ వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.
తప్పుడు డిజైన్‌కి కారణమైన నిర్మాణ సంస్థ, కన్సల్టెంట్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేశారు. బ్రిడ్జ్ లో మార్పులు సూచించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అవసరమైన మార్పులు పూర్తి అయిన తర్వాతే ఈ బ్రిడ్జ్ ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
PWD మంత్రి రాకేష్ సింగ్ ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ బ్రిడ్జ్‌ను సమీక్షించింది. 30–35 కిలోమీటర్ల పైన వేగంతో నడిపితే ప్రమాదం తప్పదని NHAI స్పష్టం చేసింది. ఈ డిజైన్‌ను పునః సమీక్షించాలని, భవిష్యత్ ప్రమాదాలు నివారించేలా కొత్త రూపకల్పన చేయాలని సిఫార్సు చేసింది. అయినప్పటికీ ఈ డిజైన్‌కు పూర్వంలో ఎలా ఆమోదం లభించిందన్న దానిపై అధికారులు మౌనం పాటించారు.
ఈ బ్రిడ్జ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తీవ్రంగా స్పందించారు. 90 డిగ్రీల మలుపుపై అనేక ట్రోల్స్, మీమ్స్ బయటపడ్డాయి. పెద్ద వాహనాలు ఎలా తిరుగుతాయనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రాంత ప్రజలు పదేళ్లుగా ఈ బ్రిడ్జ్ కోసం ఎదురు చూస్తున్నారని, అయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల వారి భద్రతే పక్కన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బ్రిడ్జ్ డిజైన్ దశలో రైల్వే శాఖ చేసిన తప్పులు కూడా ఉన్నాయని అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. అయితే.. అందుకు పీడబ్ల్యూడీ ఇంజినీర్లు భూమి తక్కువగా ఉందని, ఇదే డిజైన్ సాధ్యమన్నారు. ఐష్‌బాగ్ రైల్వే క్రాసింగ్ మూయడంతో ఈ బ్రిడ్జ్ నిర్మించాల్సి వచ్చింది. 2022 మేలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తికాలేదు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.18 కోట్లు కాగా, బ్రిడ్జ్ పొడవు 648 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు. ఇందులో 70 మీటర్ల మేర రైల్వే భూమిలోకి వస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బ్రిడ్జ్‌పై ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించింది. దీనిని చూస్తే ప్రభుత్వ ప్రణాళికల లోపాలు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతాయని పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. “దోషులెవ్వరూ తప్పించుకోలేరు. తప్పులన్నీ సరిచేసిన తర్వాతే ఈ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రజల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం” అని స్పష్టం చేశారు.






