UP: ఉత్తరప్రదేశ్ లో జరిగిన లడ్డూ మహోత్సవంలో అపశ్రుతి

by Shamantha N |   (  Updated:2025-01-28 17:16:01  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిన లడ్డూ మహోత్సవంలో అపశ్రుతి జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టేజీ కుప్పకూలి ఏడుగురు చనిపోయారు.

UP: ఉత్తరప్రదేశ్ లో జరిగిన లడ్డూ మహోత్సవంలో అపశ్రుతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగిన లడ్డూ మహోత్సవంలో అపశ్రుతి జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టేజీ కుప్పకూలి ఏడుగురు చనిపోయారు. 75 మందికి గాయలయ్యాయి. బరౌత్ నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో మతపరమైన లడ్డూ నిర్వాణ మహోత్సవం జరగాల్సి ఉంది. ఇందుకోసం 65 అడుగుల ఎత్తులో చెక్కలతో వేదికను నిర్మించారు. దానిపై 4-5 అడుగుల ఎత్తున్న దేవుడి విగ్రహం పెట్టారు. దేవుడి విగ్రహాన్ని సందర్శించడానికి భక్తులు చెక్కలతో నిర్మించిన మెట్లు ఎక్కుతున్నారు. ఇంతలో అధిక బరువు కారణంగా దానికి నిర్మించిన మెట్లు విరిగిపోయాయి. స్టేజీ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. భక్తులు స్టేజీ కింద చిక్కుకుపోయారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తొక్కిసలాట

తొక్కిసలాటను అదుపు చేసేందుకు యత్నించిన పలువురు పోలీసులకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డీఎం అస్మితాలాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. బాగ్‌పత్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Next Story