ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు షాక్.. తాత్కాలిక బ్యాన్‌ను సమర్థించిన ధర్మాసనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-18 14:13:17  IST  )

టెలిగ్రామ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాడీవేడిగానే జరిగింది.

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు షాక్.. తాత్కాలిక బ్యాన్‌ను సమర్థించిన ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నీట్ యూజీ 2026’ (NEET-UG 2026) రీ ఎగ్జామ్ నేపథ్యంలో, ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram)పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. నీట్ పరీక్షకు ముందు ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ముఠాలు టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ను పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లుగా తమ వద్ద షాకింగ్ సమాచారం ఉందని కోర్టుకు వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్ డిజైన్, అందులోని అనామక ఫీచర్లు, బాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి నేరగాళ్లను గుర్తించకుండా దర్యాప్తు సంస్థల దారి మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. జూన్ 21 పరీక్షను నీట్ రీ ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించాలనే ముందస్తు జాగ్రత్తగా ఐటీ చట్టంలోని సెక్షన్-69A కింద జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక బ్యాన్ విధించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.

యూజర్ల హక్కులను ఎలా కాలరాస్తారు..?

టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదిస్తూ.. దేశంలో కేవలం నీట్ అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, భారతదేశంలోని 15 కోట్ల మంది ఇతర టెలిగ్రామ్ వినియోగదారుల డిజిటల్, సమాచార హక్కులను పూర్తిగా నిలిపివేయడం ఏమాత్రం సమంజసం కాదని వాదించారు. కొన్ని వివాదాస్పద గ్రూపులను బ్లాక్ చేయాలి తప్ప, మొత్తం యాప్‌నే మూసివేయడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం టెలిగ్రామ్‌పై తాత్కాలిక బ్యాన్‌ సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ చర్యల తీవ్రత, టెలిగ్రామ్ భద్రతా లోపాలను పరిశీలిస్తూ.. కేసులో తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.

Next Story