ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ ట్యాంకర్, బస్సు, ఆటో ఢీ.. బోల్తాపడ్డ మూడు వాహనాలు

by Ramesh Naini |

కర్ణాటకలోని కలబురిగి జిల్లా చించోలి తాలూకా పోల్కంపల్లి తండా గేట్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. సిమెంట్ ట్యాంకర్, బస్సు, ఆటో ఢీ.. బోల్తాపడ్డ మూడు వాహనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని కలబురిగి జిల్లా చించోలి తాలూకా పోల్కంపల్లి తండా గేట్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన ఓ సిమెంట్ ట్యాంకర్.. ప్రైవేట్ బస్సును, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు వాహనాలు బోల్తా పడగా, 13 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణలోని తాండూరు నుంచి చించోలి వైపు సిమెంట్ ట్యాంకర్ వెళ్తోంది. మార్గమధ్యంలో ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి, చించోలి నుంచి వెంకటాపూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో కూడా ధ్వంసమైంది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చించోలిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్వల్పంగా గాయపడిన వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై చించోలి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story