వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు: 10 వేల మందికి పైగా మృతి చెందే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-25 02:41:37  IST  )

వెనెజువెలాలో సంభవించిన భయంకర భూకంపం వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు: 10 వేల మందికి పైగా మృతి చెందే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: వెనెజువెలా (Venezuela) దేశంలో భారీ భూకంపం సంభవించింది. రాజధాని కరాకస్ (Caracas) సమీపంలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించడంతో బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ప్రాణభయంతో ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. పొరుగు దేశమైన కొలంబియాలో కూడా ఈ భూకంప ప్రకంపనలు తీవ్రంగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

39 సెకన్ల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా, అది జరిగిన సరిగ్గా 39 సెకన్లకే అంతకంటే శక్తివంతమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మొదటి భూకంపం యారాక్యూ రాష్ట్రంలో భూగర్భంలో 21.9 కి.మీ లోతులో కేంద్రకృతం కాగా.. రెండో భూకంప కేంద్రం యుమారే పట్టణానికి ఆగ్నేయంగా 23 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో నమోదైంది. ఈ విపత్తు కారణంగా భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని USGS హెచ్చరించింది. అదేవిధంగా భూకంపం కారణంగా 10 వేల కంటే ఎక్కువ మంది మరణించే అవకాశం 44 శాతం ఉందని, ఆ సంఖ్య లక్ష దాటే అవకాశం 30 శాతం వరకు ఉందని అంచనా వేసింది.

సెలవు రోజు కావడంతో పెరిగిన ముప్పు

స్పానిష్ వలస పాలనపై వెనెజువెలా స్వాతంత్ర పోరాట వీరుడు సైమన్ బోలివర్ (Simón Bolívar) సాధించిన విజయానికి గుర్తుగా ‘బాటిల్ ఆఫ్ కారాబోబో’ జాతీయ సెలవు దినం రోజున ఈ భూకంపం సంభవించింది. సాధారణ రోజుల కంటే సెలవు దినం కావడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండటం వల్ల ముప్పు తీవ్రత మరిత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా జపాన్‌లోనూ భారీ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. అక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా జపాన్‌లో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలివేశారు.

Next Story