Serbia: అట్టుడికిన సెర్బియా పార్లమెంటు.. ముగ్గురు ఎంపీలకు గాయాలు

by Shamantha N |

సెర్బియా పార్లమెంటు(Serbia Parliament) అట్టుడికింది. ప్రతిపక్షాల నిరసనతో గందరగోళం ఏర్పడింది. స్మోక్ బాంబులు, కోడిగుడ్లు, వాటర్‌ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Serbia: అట్టుడికిన సెర్బియా పార్లమెంటు.. ముగ్గురు ఎంపీలకు గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సెర్బియా పార్లమెంటు(Serbia Parliament) అట్టుడికింది. ప్రతిపక్షాల నిరసనతో గందరగోళం ఏర్పడింది. స్మోక్ బాంబులు, కోడిగుడ్లు, వాటర్‌ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్‌ సమయంలో పార్లమెంటులో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార పార్టీ అనేక నిర్ణయాలను ఆమోదించే యోచనలో ఉందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఇది చట్టవిరుద్ధమని, ప్రధాని మిలోస్‌ వుచెవిక్‌ రాజీనామాను వెంటనే ఆమెదించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. బ్యానర్లు చేతపట్టి, నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు.

పార్లమెంటులో తీవ్ర వాగ్వాదం

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన స్పీకర్‌ అనా బ్రనాబిక్‌.. ప్రతిపక్షాలను ఉగ్రవాద ముఠాలుగా పేర్కొన్నారు. మరోవైపు, సెర్బియాలోని ఉత్తరప్రాంతంలో ఓ బిల్డింగ్ కూలి 15 మంది చనిపోయారు. విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రధానమంత్రి మిలోస్‌ వుచెవిచ్‌ ఇటీవలే రాజీనామా చేశారు. పార్లమెంటు దీన్ని ఆమోదించాల్సి ఉంది. కొత్త చట్టం అమల్లోకి రావాలంటే పార్లమెంట్ ప్రధానమంత్రి రాజీనామాను ధృవీకరించాలి. కొత్త చట్టాలను ఆమోదించే అధికారం ప్రభుత్వానికి లేదని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. మరోవైపు విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

Next Story