మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర వేట.. నాలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్

by Gantepaka Srikanth |

దేశంలో మావోయిస్టు ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత భారీ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం ముమ్మర వేట.. నాలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టు ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత భారీ ఆపరేషన్‌ ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు, మోస్ట్ వాంటెడ్‌గా మిసిర్ బెస్రా లక్ష్యంగా ఈ ముమ్మర వేట ప్రారంభమైంది. రాష్ట్రాల సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ జాయింట్ ఆపరేషన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు రాష్ట్రాల ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను, సరిహద్దు గ్రామాలను బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర పారామిలటరీ దళాలు (CRPF, కోబ్రా కమాండోలు) ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసు బలగాలతో కలిసి వ్యూహాత్మక ప్రాంతాలలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా ఎవరూ తప్పించుకోకుండా గట్టి బందోబస్తు, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

అగ్రనేతలే లక్ష్యంగా తుది అడుగులు..

ఇటీవల కాలంలో పలువురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోవడంతో పాటు, అటవీ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో మిగిలిన అగ్రనేతలను పట్టుకునేందుకు ఇదొక కీలకమైన తరుణంగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కోట్లాది రూపాయల బహుమతి కలిగిన మిసిర్ బెస్రా, గణపతి లాంటి టాప్ కమాండర్లు ఈ నాలుగు రాష్ట్రాల పరిధిలోని సురక్షిత ప్రాంతాలలో లేదా అడవుల్లో ఆశ్రయం పొంది ఉండవచ్చనే అనుమానంతో అధికారులు ఈ ఉమ్మడి వేటను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఆపరేషన్ దేశీయ అంతర్గత భద్రత పరంగా మావోయిస్టుల నెట్వర్క్‌కు పెద్ద దెబ్బ కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story