భయానకంగా గగనయానం.. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమానప్రమాదాలు జరిగాయంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-12 12:17:25  IST  )

ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంతో తమ కలలను నేరవేర్చుకునేందుకు బయలుదేరిన వారిని ఆకాశం అర్ధాంతరంగా తమలోకి లాగేసుకుంది.

భయానకంగా గగనయానం.. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమానప్రమాదాలు జరిగాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంతో తమ కలలను నెరవేర్చుకునేందుకు బయలుదేరిన వారిని ఆకాశం అర్ధాంతరంగా తమలోకి లాగేసుకుంది. జూన్ 12, 2025.. కేవలం క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చిన రోజు. భారత విమానయాన చరిత్రలో (History of Aviation) ఒక మరుపరాని మచ్చగా మారిపోయిన రోజు. 'దయచేసి సీట్‌బెల్ట్‌లు ధరించండి' అని అనౌన్స్‌మెంట్ వచ్చిన కాసేపటికే వారి ప్రయాణం దురదృష్టకరపు మలుపు తీసుకుంది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు (Air India) చెందిన AI-171 బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ (London) గాట్విక్‌కు బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం, విమానాశ్రయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 180 మందికి పైగా మృతదేహాలు గుర్తించినట్లు సమాచారం. పలువురు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ దుర్ఘటన ఒక్కటే కాదు.. భారతదేశ విమాన ప్రయాణ చరిత్రలో ఘోరమైన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.

దేశంలో జరిగిన ఘెర విమాన ప్రమాదాలు:

* బాంద్రా వద్ద కూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 (1978):

న్యూ ఇయర్ రోజున ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న బోయింగ్ విమానం అరేబియన్ సముద్రంలో పడింది. ఈ ప్రమాదంలో 213 మంది ప్రయాణికులు చనిపోవడం మన దేశ విమాన చరిత్రలో మరచిపోలేని ఘటనగా మిగిలిపోయింది. స్పాటియల్ డిస్‌ఓరియెంటేషన్ వల్ల కెప్టెన్ నియంత్రణ కోల్పోవటంతో ప్రమాదం జరిగింది.

* ఇండియన్ ఏయిర్‌లైన్స్ ఫ్లైట్ 113 (1988):

ముంబై–అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737–200 విమానంలో సాకేంతిక లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు.

* బెంగుళూరు ప్రమాదం (1990):

ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 605 ముంబాయి నుంచి బెంగళూరుకు చేరుకుని ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగి 92 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ప్రమాదం పైలట్ తప్పిదంగా తేలింది.

* చార్కి దాద్రీ మిడ్-ఎయిర్ కొల్లిజన్ (1996 ):

ఇది ప్రపంచ విమాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. సౌదీ అరేబియన్ ఫ్లైట్ 763, ఖజాఖస్తాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1907 ఢీకొనడంతో 349 మంది మృతి చెందారు.

* భారత-అలయన్స్ ఏయిర్ ఫ్లైట్ 7412 (2000):

కోల్‌కతా–పట్నా మార్గంలో బోయింగ్ 737 ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 ప్రయాణికులు, 5 మంది భూమి మీద ఉన్నవారు సహా మొత్తం 60 మందికి పైగా మృతి చెందారు.

* మంగళూరు విమాన ప్రమాదం (2010):

దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై ప్రమాదానికి గురై 158 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇది ఆ కాలంలో అత్యంత దారుణమైన విమాన ప్రమాదంగా నిలిచింది.

* జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 471 (1972):

జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం 471 బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ చేరుకుని విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 82 మంది ప్రయాణికులు, నేలపై ముగ్గురు మరణించారు. తప్పుడు గ్లైడ్ పాత్ సిగ్నల్ ప్రమాదానికి కారణమని జపాన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

* యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం 869 (1963):

యునైటెడ్ అరబ్ ఎయిర్‌లైన్స్ విమానం 869 ముంబాయి విమానాశ్రయంలో కూలిపోయింది. అందులో ఉన్న 63 మంది మరణించారు. వాతావరణంలో మార్పుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం.

* అలిటాలియా విమానం 771 (1962):

అలిటాలియా విమానం 771 ముంబైకి ఈశాన్యంగా ఉన్న కొండను సమీపిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదం నావిగేషన్ లోపం వల్ల జరిగింది. ఈ ఘటనలో ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 94 మంది మరణించారు.

* ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 171 (1976):

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 171 ముంబై నుంచి చెన్నైకి బయలుదేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య తలెత్తి తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే, ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 95 మంది మరణించారు.

కేవలం ఇవే కాదు, మన దేశ విమానయాన చరిత్రలో మరికొన్ని ప్రమాదకర ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క క్షణం ఆలస్యం, ఒక్క చిన్న సాంకేతిక లోపం, ఒక్క తప్పు నిర్ణయం.. వందలాది జీవితాల్లో తీరని కన్నీటిని మిగుల్చుతుంది. ఈ ఘోర ఘటనలన్నింటి తర్వాత విమానయానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం, డీజీసీఏ (DGCA), ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకొని భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. విమానయాన భద్రత కోసం కొత్త టెక్నాలజీలు, గగననిరీక్షణ వ్యవస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నియమాలపై బలమైన అవగాహన కల్పిస్తోంది. ఈ రోజు జరిగిన సంఘటన దేశాన్ని కలచివేసినా.. ఇది భద్రతపై మరింత దృష్టి పెట్టేందుకు ఒక హెచ్చరికగా మారింది.

Next Story