Sayali Surve: మరో ‘కేరళ స్టోరీ’..? మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ సాయలీ సుర్వే మిస్సింగ్!

by Kema Shiva Kumar |

మాజీ మిస్ ఇండియా సాయలీ సుర్వే హఠాత్తుగా అదృశ్యమయ్యారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే ఆమె అపహరణకు గురయ్యారనే వార్తలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Sayali Surve: మరో ‘కేరళ స్టోరీ’..? మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ సాయలీ సుర్వే మిస్సింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ మిస్ ఇండియా ఎర్త్ (2019) విజేత సాయలీ సుర్వే (Sayali Surve) అదృశ్యం అవ్వడం మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఆమె ఇస్లాం (Islam) నుంచి తిరిగి హిందూ మతంలోకి మారిన కొద్దిరోజులకే ఆమె అపహరణకు గురయ్యారని హిందూత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయలీ సుర్వే 2019లో మీరా భయందర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆతిఫ్ తాసేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె ఇస్లాంలోకి మారి తన పేరును అలీజా తాసేగా మార్చుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకే తన భర్త, అత్తమామల నుంచి తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులు మొదలయ్యాయని, తనను బలవంతంగా మతం మార్చారని ఆమె గతంలో ఆరోపించారు.

తిరిగి హిందూ మతంలోకి..

భర్త కుటుంబం నుంచి ఎదురవుతున్న చిత్రహింసలను తట్టుకోలేక ఆమె హిందూత్వ సంస్థల సాయం కోరారు. ఈ ఏడాది మార్చి 8, 2026న పింప్రి-చించ్వాడ్‌లోని ఆర్యసమాజ్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తిరిగి హిందూ మతంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆమె తన పేరును ఆద్యా సుర్వే (Adya Surve)గా మార్చుకున్నారు. మతం మారిన కొద్దిరోజులకే సాయలీ సుర్వే అదృశ్యం కావడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.

హిందూ సంఘాల ఆరోపణలు..

ఆమెను తన భర్త, అత్తమామలే కిడ్నాప్ చేశారని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని హిందూత్వ నాయకుడు మిలింద్ ఏక్బోటే ఆరోపించారు. ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదని, ఆమెను ఏదో ఒక చోట బంధించి హింసిస్తున్నారని సోషల్ మీడియా (Social Media)లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనపై పుణె, పింప్రి-చించ్వాడ్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇది ‘లవ్ జిహాద్’, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన అంశం కావడంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. ఆమె స్వచ్ఛందంగా వెళ్లిందా లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే కోణంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Next Story