'జై శ్రీరామ్' అంటే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. కోల్‌కతా డాక్టర్ ఆఫర్‍పై నెటిజన్ల రియాక్ట్

by Prasad Jukanti |   (  Updated:2026-04-14 12:48:12  IST  )

'జై శ్రీరామ్' అని పలికే రోగులకు ఫీజులో రూ.500 తగ్గింపు ఇస్తానన్న కోల్‌కతా డాక్టర్ పీకే హజ్రా. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జై శ్రీరామ్ అంటే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. కోల్‌కతా డాక్టర్ ఆఫర్‍పై నెటిజన్ల రియాక్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో ఒక డాక్టర్ తన రోగుల కోసం ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన క్లినిక్‌కు వచ్చే రోగులు 'జై శ్రీరామ్' (Jai Shri Ram) అని పలికితే వారికి కన్సల్టేషన్ ఫీజులో రూ.500 డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోల్‌కతాకు (Kolkata) చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీకే హజ్రా (Doctor PK Hazra) ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడుతూ.. తన కన్సల్టేషన్ ఫీజు ముందుగా రూ. 2000 ఉండేది. ప్రజలు సహాయం చేసేందుకు తొలుత రూ.1500 లకు తగ్గించాను. కానీ ఇప్పుడు నేను మరొక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎవరైనా జై శ్రీరామ్ అంటే వారికి మరో రూ.500 తగ్గించి వారి వద్ద కేవలం రూ. 1000 మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం తన సొంత క్లినిక్‍లో కన్సల్టేషన్ వచ్చే రోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. నేను మానసికంగా బీజేపీ (BJP) సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని ఆ పార్టీకి నా మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో ఎలాంటి అనైతికత లేదు. ఇది కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన చొరవ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

నెటిజన్ల రియాక్ట్:

డాక్టర్ పీకే హజ్రా ప్రకటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది డాక్టర్ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరడానికి లేదా మద్దతు ఇవ్వడానికి హక్కు ఉన్నప్పటికీ ఒక రోగి మతం, రాజకీయ అనుబంధం ఆధారంగా వారి కన్సల్టేషన్ ఫీజులో వివక్ష చూపడం వైద్య నైతిక విలువలకు, వృత్తిపరమైన ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హజ్రా వ్యాఖ్యలను సమర్ధిస్తున్న వారు ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో నిందితులు ఓ వర్గానికి చెందిన వారు డాక్టర్లేనంటూ గుర్తు చేస్తున్నారు. మొత్తంగా డాక్టర్ హజ్రా ప్రకటించిన డిస్కౌంట్ బెంగాల్ ఎన్నికల వేళ సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే హజ్రా చేసిన ప్రకటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ తీవ్రంగా తప్పు పట్టినట్లు పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Next Story