నెలకు రూ.500 పెట్టుబడితో లక్షన్నరకు పైగా రాబడి.. ఎలాగో చూడండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-27 00:33:11  IST  )

నెలకు కేవలం రూ.500తో లక్షల రూపాయలు కూడబెట్టవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలు లేకపోయినా, చిన్న మొత్తాలతో నిరంతరంగా పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో గణనీయమైన నిధిని సృష్టించవచ్చని వారు సూచిస్తున్నారు.

నెలకు రూ.500 పెట్టుబడితో లక్షన్నరకు పైగా రాబడి.. ఎలాగో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: నెలకు కేవలం రూ.500తో లక్షల రూపాయలు కూడబెట్టవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తాలు లేకపోయినా, చిన్న మొత్తాలతో నిరంతరంగా పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో గణనీయమైన నిధిని సృష్టించవచ్చని వారు సూచిస్తున్నారు. పెట్టుబడిని ఎంత కాలం కొనసాగిస్తామన్నదానిలోనే రాబడి ఉంటుంది.

అలాంటి చిన్న మొత్తాల పెట్టుబడులకు అనువైన నాలుగు ముఖ్యమైన పథకాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. వీటిలో విద్యార్థులు, గృహిణులు, తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు వంటి వారు సురక్షితంగా మేలైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

మొదటిది SIP, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నెలకు రూ.500 చొప్పున ఆటోమేటిక్‌గా డబ్బు జమ చేసే విధానమిది. మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడి ఇచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌పై ఆసక్తి ఉన్న కానీ నేరుగా షేర్లలో పెట్టుబడి చేయాలనుకోని వారికి సరైన ఎంపిక.

రెండోది PPF. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ప్రభుత్వ హామీతో కూడిన పొదుపు పథకం. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతా తెరవొచ్చు. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో కూడిన ఈ పథకానికి ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.500 చొప్పున పెట్టుబడి పెడితే 25 ఏళ్లలో దాదాపు రూ.4.12 లక్షలు అంచనాగా రూపుదిద్దుకుంటాయి. ఈ పథకంలో పెట్టుబడికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

మూడోది సుకన్య సమృద్ధి యోజన (SSY). ఇది ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. 10 ఏళ్లలోపు వయస్సున్న ఆడపిల్ల కోసం ఖాతా ప్రారంభించాలి. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తున్న ఈ పథకంలో నెలకు రూ.500 చొప్పున 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే, 21 ఏళ్ల తర్వాత సుమారు రూ.2.77 లక్షలు మెచ్యూరిటీగా వస్తాయి.

చివరిది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం. స్వల్పకాలిక అవసరాల కోసం 5 ఏళ్ల గడువుతో దీన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. నెలకు రూ.500 చొప్పున 5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే రూ.35,681 వరకు రాబడి పొందవచ్చు.

ఈ నాలుగు పథకాలతో రూ.500 చొప్పున పద్ధతిగా పెట్టుబడి పెడితే, కాలక్రమంలో అది లక్షల రూపాయల నిధిగా మారుతుంది. పెద్ద మొత్తాలేవీ అవసరం లేకుండా, చిన్న పొదుపులతోనే బలమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Next Story