Sanjay singh: ఆప్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర.. ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

by vinod kumar |
Sanjay singh: ఆప్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర.. ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay singh) అన్నారు. ఆప్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆరోపించారు. దేశ రాజధానిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆప్ క్యాండిడేట్స్ ను బీజేపీలో చేరాలని ప్రలోభపెడుతున్నారని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడుగురు అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. ‘పోలింగ్ ముగిసిన వెంటనే ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. పార్టీని వదిలి బీజేపీలో చేరడానికి రూ. 15 కోట్లు ఇస్తామని చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.

ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ తన ఓటమిని అంగీకరించిందని తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీలోనూ పార్టీలను విచ్ఛిన్నం చేసే కుట్రలను ప్రారంభించిందని విమర్శించారు. ప్రలోభాలకు గురిచేసే ఆడియో కాల్స్‌ను రికార్డ్ చేసి వాటిపై ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించామన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నించినా రహస్య కెమెరాతో దాని వీడియో తీయాలన్నారు. కాగా, 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ (Exit polls) ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని అంచనావేశాయి. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story