Sanjay Raut: కాంగ్రెస్‌లోకి సంజయ్ రౌత్.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం!

by vinod kumar |
Sanjay Raut: కాంగ్రెస్‌లోకి సంజయ్ రౌత్.. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణే (Nithish rane) సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన (యూబీటీ) కీలక నేత సంజయ్ రౌత్ (Sanjay raut) త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఓ నాయకుడితో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘సంజయ్ రౌత్ రాజ్యసభ పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఆయన రెండోసారి విజయం సాధించేందుకు ఉద్ధవ్ థాక్రే (Udhav thakray) నేతృత్వంలోని పార్టీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరు. కాబట్టి రౌత్ కాంగ్రెస్‌లోకి వెళ్తారు. ఈ విషయమై ఆ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు’ అని తెలిపారు.

సంజయ్ శివసేన (యూబీటీ)లో ఎంత కాలం ఉంటారో సామ్నా పత్రికలో వెల్లడించాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న నాయకుడి వివరాలు సైతం బహిర్గతం చేయాలన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis), ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath shinde)ల మధ్య విభేదాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయని సంజయ్‌ రౌత్‌ ఇటీవల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగించిన విషయంతో ఏక్ నాథ్ షిండే సంతృప్తి చెందలేకపోయారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నితీశ్ రాణే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, శివసేన(యూబీటీ)లో సంజయ్ రౌత్ సీనియర్ నేతగా ఉన్నారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లు మిత్ర పక్షాలుగా ఉన్నాయి.

Next Story

Most Viewed