S-400: తొలిసారిగా S- 400 ప్రయోగం.. పాక్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం

by B.Srinivas |

డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను ఢీకొట్టడానికి పాక్ ప్రయత్నించింది.

S-400: తొలిసారిగా S- 400 ప్రయోగం.. పాక్ క్షిపణులు, డ్రోన్లు ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ చేసిన ఓ భారీ మిస్సైల్, డ్రోన్ దాడిని భారత్ భగ్నం చేసింది. డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను ఢీకొట్టడానికి పాక్ ప్రయత్నించింది. గురువారం తెల్లవారుజామున15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నింది. అయితే భారత రక్షణ వ్యవస్థలు ఈ దాడులను పూర్తిగా తిప్పికొట్టాయి. రష్యా నుంచి అందుకున్న అత్యాధునిక ఎస్-400 (S 400) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి పాక్ క్షిపణులను తిప్పి కొట్టినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న డ్రోన్లను గుర్తించిన ఎస్-400 వాటిని విజయవంతంగా ధ్వంసం చేసినట్టు వెల్లడించాయి. పాక్ లక్ష్యాలలో అవంతిపోరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, లూధియానా, భుజ్‌లోని స్థావరాలు ఉన్నాయి.

కాగా, S-400 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ. దీనిని సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తారు. ఇవి దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు క్షిపణులను గుర్తించి వాటిని కూల్చేయగలవు. వీటిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం 4 చోట్ల భారత్ ఈ వ్యవస్థలను మోహరించినట్టు తెలుస్తోంది. ఒకటి జమ్మూ కశ్మీర్, పంజాబ్ రక్షణ కోసం పఠాన్‌కోట్‌లో ఉంచగా, మరొకటి రాజస్థాన్, గుజరాత్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తుంది. భారత్ S-400 వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Next Story