నేడు అమెరికా, రష్యా అధికారుల సమావేశం

by Ajay Maddhiboyina |

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే యూఏఈ చేరుకున్నారు. చర్చల సమాయానికి ఆయన సౌదీ వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

నేడు అమెరికా, రష్యా అధికారుల సమావేశం
X

- సౌదీ వేదికగా చర్చలు జరపనున్న అత్యున్నత అధికారులు

- ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనపై కూడా చర్చ

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, అమెరికా దేశాలకు చెందిన అత్యున్నత అధికారులు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా సమావేశం కానున్నారు. కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య చెడిపోయిన దౌత్య సంబంధాలను పునరుద్దరించేందుకు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్‌కు విదేశాంగ విధాన సలహాదారు యూరీ యుషాకోవ్ రష్యా తరపున చర్చల్లో పాల్గొననున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కెవ్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.

'విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్ సలహాదారు యుషాకోవ్ సౌదీ బయలుదేరి వెళ్తున్నారు. రియాద్‌లో అమెరికా ప్రతినిధులతో రెండు దేశాల దౌత్య సంబంధాలపై చర్చలు జరుపుతారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు సంబంధించిన చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది' అని పెస్కోవ్ మీడియాకు తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ముఖాముఖి సమావేశం ఉంటుందా అన్న ప్రశ్నకు పెస్కోవ్ సమాధానం ఇవ్వలేదు.కాగా.. ఉక్రెయిన్ యుద్దం మొదలై మూడేళ్లు కావొస్తున్నా.. ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గలేదు. ఉక్రెయిన్ యుద్దం కారణంగా రష్యాకు అమెరికాతో సంబంధాలు దారుణంగా పతనమయ్యాయి. ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రష్యా-అమెరికా సంబంధాల బలోపేతంతో పాటు.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం రష్యాతో అమెరికా చర్చలకు సిద్ధమైంది. ఇప్పటికే ఇరు దేశాల నేతలు ఫోన్‌లో ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే యూఏఈ చేరుకున్నారు. చర్చల సమాయానికి ఆయన సౌదీ వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

Next Story