Russia: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి.. 40 విమానాలు ధ్వంసం !

by B.Srinivas |

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకర స్థాయికి చేరుకుంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ దాడులు చేసుకున్నాయి.

Russia: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి.. 40 విమానాలు ధ్వంసం !
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం మరోసారి భీకర స్థాయికి చేరుకుంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ దాడులు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. కీవ్ ఆర్మీ ట్రెయినింగ్ యూనిట్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సెస్ తెలిపింది. అయితే అటాక్ టైంలో అక్కడ సైనిక కవాతు జరగలేదని అంతేగాక జవాన్లు అక్కడ గుమిగూడలేదని పేర్కొంది. కాగా, ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అతి పెద్ద డ్రోన్ దాడి నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ దాడుల్లో భాగంగా రష్యా 472 డ్రోన్లు, ఏడు క్షిపణులను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానిక దళ కమ్యూనికేషన్స్ చీఫ్ యూరి ఇగ్నాట్ తెలిపారు. వాటిలో ఒక క్షిపణి ఉక్రెయిన్‌లోని సైనిక శిక్షణా విభాగాన్ని ఢీకొట్టగా నష్టం జరిగినట్టు పేర్కొన్నారు.

రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ సైతం రష్యాపై అటాక్ చేసింది. సైబీరియాతో పాటు ఇతర వైమానిక స్థావరాలపై భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. ముర్మాన్స్క్‌లోని ఒలెన్యా ఎయిర్ బేస్, ఇర్కుట్స్క్‌లోని బెలాయా ఎయిర్ బేస్, ఇవనోవోలోని ఇవనోవో, డయాగిలేవో ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్టు సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) తెలిపింది. ఈ దాడుల్లో 40 రష్యాన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది. ఇందులో టీయూ-95, టీయూ-22 వంటి బాంబర్లు సైతం ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్‌పై దీర్ఘ-శ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి రష్యా మోహరించిన వ్యూహాత్మక బాంబర్లు కావడం గమనార్హం. అయితే దీనిని రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో తమ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్టు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైబీరియాలో దాడి జరగడం కూడా ఇదే తొలసారి.

రష్యా సైన్యానికి భారీ ఎదురుదెబ్బ !

రష్యా ప్రభుత్వం అధికారికంగా నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ ఈ దాడితో రష్యా మౌలిక సదుపాయాలకు తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు. ఈ దాడులు ఉక్రెయిన్ వ్యూహాత్మక విధానంలో ఒక మలుపును సూచిస్తాయని, రష్యన్ భూభాగంలోకి లోతుగా ఖచ్చితత్వంతో దాడి చేయగల దాని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇస్తాంబుల్ లో సోమవారం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరనున్నాయి. తమ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story