- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. 21 మంది మృతి
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకరంగా మారింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా ఆదివారం బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం మరింత భీకరంగా మారింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని సుమీ (Sumy) నగరంపై రష్యా ఆదివారం బాలిస్టిక్ క్షిపణుల (Balistic missiles)తో దాడి చేసింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా 83 మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. పవిత్రమైన పామ్ సండే పండుగను జరుపుకోవడానికి స్థానిక ప్రజలు గుమిగూడిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. రెండు బాలిస్టిక్ క్షిపణులు నగరాన్ని ఢీ కొట్టగా.. దాడిలో ప్రాణ నష్టంతో పాటు పలు నివాస భవనాలు, పాఠశాలలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని అవసరమైన సేవలు సంఘటనా స్థలంలో పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
మాస్కోపై ఆంక్షలు విధించాలి: జెలెన్ స్కీ
సుమీ నగరంపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తీవ్రంగా ఖండించారు. రష్యాపై ప్రపంచ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటని అభివర్ణించారు. ‘ఇది పామ్ సండే ప్రజలు ఆనందంగా చర్చికి వెళ్లే సందర్భంగా రష్యా క్షిపణులను ప్రయోగించింది. రాక్షసులు మాత్రమే ఇలా చేయగలరు’ అని పేర్కొన్నారు. ముఖ్యమైన పండుగ రోజున ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. దాడి అనంతరం నగర వీధుల్లో నేలపై పడి ఉన్న శవాలు, ధ్వంసమైన బస్సు, కాలిపోయిన కార్లను చూపించే హృదయ విదారక వీడియోను సైతం జెలెన్ స్కీ విడుదల చేశారు. రష్యాపై ఒత్తిడి లేకుండా దాడులను ఆపడం అసాధ్యం, కాబట్టి యూరప్ తో పాటు అమెరికా సైతం ఆంక్షలు విధించాలి అని తెలిపారు.
కాగా, రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఇరు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇంధన వ్యవస్థలపై దాడులను ఆపడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే తాజా దాడులు జరగడం గమనార్హం. అంతకుముందు తమ దేశంలోని భారత ఔషధ గిడ్డంగిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది.






