Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. 477 డ్రోన్లతో దాడి

by B.Srinivas |

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్ లోని పలు ప్రాంతాల్లో 477 డ్రోన్లు, 60 క్షిపణులను ప్రయోగించింది.

Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. 477 డ్రోన్లతో దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 477 డ్రోన్లు, 60 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఎంకే ఎన్-23 బాలిస్టిక్ క్షిపణులు, 33 కేహెచ్-101, ఇస్కాండర్-కె క్రూయిజ్ క్షిపణులు, 4 కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనల్లో ఉక్రేనియన్ F-16 ఫైటర్ జెట్ పైలట్ మరణించగా విమానం సైతం ధ్వంసమైనట్టు పేర్కొంది. ఇటీవల కాలంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే అని అభివర్ణించింది. 211 డ్రోన్లు, 38 మిస్సైల్స్‌ను కూల్చి వేసినట్టు తెలిపింది. ఆరు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో ఇళ్లు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ల్వివ్, పోల్టావా, మైకోలైవ్, డ్నిప్రోపెట్రోవ్స్క్, చెర్కాసీ, ఇవానో-ఫ్రాంకివ్స్క్‌లలో పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. చెర్కాసీలో జరిగిన దాడుల్లో బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతినగా ఆరుగురు గాయపడ్డట్టు స్థానిక గవర్నర్ ఇహోర్ టబురెట్స్ తెలిపారు.

పాశ్చాత్య దేశాలు సాయాన్ని పెంచాలి: జెలెన్ స్కీ

రష్యా భారీ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్పందించారు. తమ వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి పాశ్చాత్య దేశాల మద్దతు పెంచాలని సూచించారు. ఈ యుద్ధాన్ని ముగించేందుకు దురాక్రమణదాడుడిపై ఒత్తిడి పెంచాలన్నారు. ఈ వారంలోనే ఉక్రెయిన్ పై 114 కి పైగా క్షిపణులు, 1,270 డ్రోన్లు, 1,100 గ్లైడ్ బాంబులను రష్యా ప్రయోగించిందని తెలిపారు. కాగా, శాంతి చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజా దాడులు జరగడం గమనార్హం.

Next Story