Russia: భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశం.. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్

by B.Srinivas |

భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశమని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇండియాకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ అన్నారు.

Russia: భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశం.. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశమని, ఆ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇండియాకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ (Sergiy Lavrov) అన్నారు. వాణిజ్యం, ఇంధన సంబంధాల గురించి భారత్ తీసుకునే డిసిషన్‌లో రష్యా జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా లావ్‌రోవ్ ఇండియా మీడియాతో మాట్లాడారు. ట్రంపు సుంకాలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయంలో భారత వైఖరిని ఆయన సమర్థించారు. చమురు, వాణిజ్యం అంశాన్ని తాను ఎప్పుడూ ప్రస్తావింబోనని, సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఇండియాకు ఉందన్నారు. అమెరికా తమ చమురును అమ్మాలనుకుంటే, దీనికి సంబంధించిన నిబంధనలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని నొక్కి చెప్పారు. దానికి ఇండియా విధానంతో సంబంధం లేదని తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Puthin) ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో పర్యటిస్తారని వెల్లడించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఏఐ, వంటి ఇతర రంగాల్లో తమకు ద్వైపాక్షిక ఎజెండా ఉందని తెలిపారు. ఈ విషయాపై ఇరు దేశాల మధ్య చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. షాంగై సహకార సంస్థ (ఎస్సీఓ), బ్రిక్స్ సహా అంతర్జాతీయంగా దగ్గరి సంబంధం ఉందని చెప్పారు. భారత జాతీయ ప్రయోజనాలను, వాటిని ప్రోత్సహించడానికి ప్రధాని మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని రష్యా గౌరవిస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఇరు దేశాల సంబంధాలపై సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావ్రోవ్ పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story