- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్‌లో హాట్ హాట్‌గా సీట్ వార్.. అధికార, విపక్షాల్లో సీట్ల గుసగుసలు!
బిహార్‌లో సీట్ షేరింగ్ సమస్య హాట్ హాట్‌గా మారింది. అధికార, విపక్షాలు అంతా ఓకే అంటున్నా పార్టీలు సిగపట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి ఉత్తర భారతదేశంలో తమ పట్టు మరింత గట్టిగా బిగించాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో ఉత్తరాదిన పూర్తిగా పట్టుకోల్పోయిన కాంగ్రెస్.. మిత్రపక్షాలతో కలిసి మళ్లీ తమ జెండా ఎగరేయాలని చూస్తోంది. అందుకే ఈ రెండు బడా పార్టీలూ ఇప్పటి నుంచే బిహార్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశాయి. అయితే ఎన్నికలు ఏవైనా సరే.. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తుంటే వచ్చే ప్రధాన సమస్య ‘సీట్ల పంపకం’. ‘అబ్బే.. సీట్ షేరింగ్‌లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. అంతా సవ్యంగానే ఉంది’ అని అధికారంలోని ఎన్డీయే, ప్రతిపక్షంలోని ఇండియా కూటమి పార్టీలు ప్రకటించాయి. కానీ ఇదే ఆ రెండు కూటములకు పెద్ద తలనొప్పిగా మారుతోంది.
చిరాగ్‌తో చికాకు..
బిహార్‌లో ఎన్డీయేకు బలం చేకూర్చడం కోసం యువనేత చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో బీజేపీ చేతులు కలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలవగానే పాశ్వాన్‌కు కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చింది. కానీ అతనికి మాత్రం రాష్ట్ర రాజకీయాలపై మక్కువ చావలేదు. అందుకే తను కేంద్రంలో ఎక్కువ కాలం ఉండనని, బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించేశారు. దానికితోడు ఆ పార్టీ వర్గాలు ‘చిరాగ్-ఫ్యూచర్ సీఎం’ అంటూ బ్యానర్లు కట్టేస్తున్నాయి. ఇవి చూస్తున్న మరో ఎన్డీయే మిత్రపక్షం జేడీ(యూ)కు కడుపులో మండిపోతోంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే కూటమికి ఫేస్ సీఎం నితీశ్ కుమారే. అయితే ఇవన్నీ ఎక్కువ సీట్లు కొట్టేసేందుకు చిరాగ్ వేస్తున్న ప్లాన్లే అని జేడీ(యూ) భావిస్తోంది. అదే సమయంలో నితీశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇబ్బందుల్లో పడేసిన విషయాలను కూడా కొందరు ఎత్తి చూపుతున్నారు. నితీశ్ వయసైపోయిందన, ఆయన స్థానంలో కొత్త సీఎం ఫేస్ అవసరమని వారి వాదన. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ అడ్డుపెట్టుకొని బిహార్‌లో సోలోగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందని కమలం పార్టీ విశ్లేషించుకుంటోదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్డీయే లెక్కలు తేలడం కష్టమే..!
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో తనకు 40-కన్నా తక్కువ ఇస్తే ఊరుకునేది లేదని చిరాగ్ ఇప్పటికే ఆల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరో కూటమి పక్షం.. జీతన్ రామ్ మాంఝీకి చెందిన ‘హిందుస్తాన్ ఆవామ్ మోర్చా’ కూడా చిరాగ్‌కు ఎన్ని సీట్లిస్తే తమకు అన్నే ఇవ్వాలని పట్టుబడుతోందట. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిసి సీట్ల పంపకం లెక్కలు తేలుస్తాయని, ఆ తర్వాతే మిగతా పార్టీల సీట్ల లెక్కలు ఒక కొలిక్కి వస్తాయని బీజేపీ అంటోంది. మొత్తానికి 102 సీట్లలో జేడీ(యూ), 101 సీట్లలో బీజేపీ పోటీ చేసి, మిగతా 40 సీట్లను ఎల్జేపీ, హెచ్‌ఏఎం, ఉపేంద్ర కుశావహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా మధ్య పంచాలని ఈ కూటమి ప్రయత్నిస్తోంది. దీనికి ఈ చిన్న పార్టీలు ఒప్పుకునేలా లేవు. వీటిని ఒప్పించేందుకు బడా పార్టీలు ఎలాంటి తాయిలాలు ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
మహాఘట్‌బంధన్‌లో బంధం లేదా?
బిహార్‌లో ప్రతిపక్ష కూటమి మహాఘట్‌బంధన్‌లో కూడా సీట్ల లెక్కలు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ.. ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని గట్టిగా నిర్ణయించుకుందట. తమ పార్టీ 140 సీట్లలో పోటీ చేసి తీరుతుందని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇప్పటికే కూటమిలోని పక్షాలకు తేల్చిచెప్పేశారట. మిగతా 103ను కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్, వీఐపీ (వికాస్‌షీల్ ఇన్‌సాన్ పార్టీ) మధ్య పంచాలని ఆర్జేడీ ప్లాన్. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే 70 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ తీర్మానించుకుంది. అంటే మిగతా 33 సీట్లను నాలుగు పార్టీలు పంచుకోవాలి. ఇదే సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్నీ.. రాష్ట్రంలో తమ నిషాద్ కులం వాళ్లు ఎక్కువగా ఉన్నారని, కాబట్టి తమకు ఎక్కువ సీట్లివ్వాలని వాదిస్తున్నారు. అలాగే మహాఘట్‌బంధన్ సర్కారు ఏర్పడితే డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆశిస్తున్నారు. ఇది కూటమిలోని మిగతా పార్టీలకు మింగుడుపడటం లేదు. దానికితోడు ఉత్తరాదిన పాపులారిటీ తగ్గిన కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు ఎలా ఇస్తామని కూడా కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. లోపల ఇంత జరుగుతున్నా పైకి మాత్రం కాంగ్రెస్.. ‘మా ప్రధాన లక్ష్యం ఎన్డీయే సర్కారును గద్దె దించడం. దీన్ని చేరుకోవడంలో సీట్ల పంపకం తొలి మెట్టు అంతే’ అని చెప్తోంది.
ఇన్ని గందరగోళాల మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకు రెండు కూటముల్లో సీట్ల పంపకం పూర్తవకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే బిహార్‌లో ఎన్నికలు ఈ రెండు కూటములకు పరీక్షలు పెట్టడం కాదు.. కూటముల్లోనే పరీక్షలు పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడం మాట దేవుడెరుగు.. ముందు ఎన్నికలకు వెళ్లాంలంటేనే పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది. మరి సీట్ల పంపకం ఈ కూటమి పార్టీల మధ్య స్నేహాన్ని పెంచుతుందా? లేక విభేదాలు రగులుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగక తప్పదు.






