విద్యార్థి ఏంజల్ చక్మాపై జరిగిన జాతి వివక్ష దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపు

by Malleboina Mahesh |

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి ఏంజల్ చక్మాపై జరిగిన జాతి వివక్ష దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపునిచ్చారు.

విద్యార్థి ఏంజల్ చక్మాపై జరిగిన జాతి వివక్ష దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థి ఏంజల్ చక్మా (Tripura student Angel Chakma)పై జరిగిన జాతి వివక్ష దాడి (Racial discrimination attack) దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా సోన్‌పైరీ గ్రామంలో జరిగిన 'హిందూ సమ్మేళనం'లో పాల్గొన్న మోహన్ భాగవత్ ప్రసంగిస్తూ సామాజిక సామరస్యం (సామాజిక సమరసత) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతదేశం అందరిదని, కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడకూడదని ఆయన స్పష్టం చేశారు. విభజన ఆలోచనలను పక్కనపెట్టి, ప్రతి భారతీయుడిని మనవానిగా గుర్తించడమే నిజమైన సామరస్యమని, ఒకవేళ దేశం ప్రమాదంలో పడితే కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండలేవని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన సామాజిక సమానత్వం కోసం కొన్ని కీలక సూచనలు చేశారు. ఆలయాలు, జలవనరులు, స్మశాన వాటికలు వంటి బహిరంగ ప్రదేశాలు హిందువులందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, అక్కడ ఎటువంటి వివక్ష ఉండకూడదని పిలుపునిచ్చారు. సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం వల్ల యువత తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారని, దీనిని నివారించేందుకు వారానికి ఒకరోజు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ 'మంగళ సంవాదం' (అర్థవంతమైన చర్చలు) జరపాలని సూచించారు. ఏంజల్ చక్మా మరణం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజ్యాంగ విలువులను గౌరవిస్తూ, పౌర క్రమశిక్షణతో మెలగాలని ఆయన ఈ సభ ద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story