50 వేల మంది ఆటో డ్రైవర్లు, బ్యూటీ పార్లర్ మహిళలు.. బెంగాల్‍లో బీజేపీ గెలుపు వెనుక RSS బిగ్ స్కెచ్!

by Prasad Jukanti |

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వెనుక ఆర్ఎస్ఎస్ 'విస్పర్ క్యాంపెయిన్' వ్యూహంతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

50 వేల మంది ఆటో డ్రైవర్లు, బ్యూటీ పార్లర్ మహిళలు.. బెంగాల్‍లో బీజేపీ గెలుపు వెనుక RSS బిగ్ స్కెచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. బెంగాల్‍లో కాషాయజెండా ఎగురవేయాలన్న తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ ఎన్నికల్లో సునామీ సృష్టించింది. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనుకు ఎండ్ కార్డు వేస్తూ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‍లో బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో ఘన విజయం సాధించి ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేసింది. 2021 ఎన్నికల్లో కేవలం 77 స్థానాలకు పరిమితమైన కమలం పార్టీ ఐదేళ్లలో ఏకంగా 207కు ఎగబాకడం వెనుక తృణమూల్ వైఫల్యాలతో పాటు బీజేపీకి ఆర్ఎస్ఎస్ బలమైన అండగా నిలవడమే ప్రధాన కారణం అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ దీదీని గద్దె దించడం కంటే తాము అధికారంలోకి రావాలన్న పట్టుదలతో పని చేసిన ఆర్ఎస్ఎస్ ఇందుకోసం ప్రణాళికలు రచించి వాటిని ఏడాది క్రితం నుంచే అమలు చేసినట్లు తెలుస్తోంది.

సైలెంట్ క్యాంపెయిన్:

ఈసారి బెంగాల్ ఎన్నికలను నరేంద్ర మోడీ, అమిత్ షా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి బహిరంగ సభలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ సంస్థల కార్యకర్తలు ఏడాది కాలంగా విస్పర్ క్యాంపెయిన్ (నిశ్శబ్ద ప్రచారం) ఈ విజయానికి ప్రధాన కారణం అయినట్లు తెలుస్తోంది. గెలుపై లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈసారి సెలబ్రిటీల కంటే స్థానికంగా ఉండే ఇన్‍ఫ్లూయెన్సర్లను తమ ప్రచారకర్తలుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆటో డ్రైవర్లు, కిరాణా దుకాణదారులు, టీ స్టాళ్ల యజమానులు, కాలనీల్లోని చిన్న చిన్న బ్యూటీ పార్లర్ల నిర్వహకులను ఎంచుకుని వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల మధ్య చర్చకు వచ్చేలా ఈ టీమ్ లు పని చేశాయని ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఆటో డ్రైవర్లు చెప్పే కట్ మనీ (ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి కమీషన్ల వసూలు) విషయాలు, బ్యూటీ పార్లర్లలో మహిళా భద్రతపై దీదీలు చేసే చర్చలు ఓటర్లలో మార్పుకు బీజానికి దారి తీసినట్లు తెలుస్తోంది. కోల్‍కతాలో సుమారు 50 వేల మంది ఆటో డ్రైవర్లు గడిచిన ఏడాది కాలంలో ఈ నిశబ్ధ ప్రచారంలో భాగస్వాములు అయినట్లు చర్చ జరుగుతోంది.

వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని:

15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన పట్ల బెంగాల్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలతో బెంగాలీ అస్తిత్వం ప్రమాదంలో పడుతోందనే చర్చ అక్కడి ప్రజల్లో ఉంది. ఈ భావనను మరింత బలంగా ఓటర్లలో నాటుకుపోయేలా చేయడంలో సంఘ్ పరివార్ విజయం సాధించినట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం సంస్థాగతంగా పక్కా వ్యూహంతో ముందుకు సాగిందని సునీల్ బన్సల్, భూపేందర్ యాదవ్, విప్లవ్ దేవ్ వంటి నేతలు బెంగాల్ లో మకాం వేసి పార్టీ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించినట్లు తెలుస్తోంది. 44 వేల బూత్ లను గుర్తించి ప్రతి 30 నుంచి 60 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్ ను నియమించి అక్కడి ఓటర్లతో నిరంతరం టచ్ లో ఉండేలా వ్యవహారం సాగించినట్లు తెలుస్తోంది. ఫలితంగా బీజేపీ బహిరంగ సభల కంటే నిశ్శబ్ధంగా మైక్రో స్థాయిలో జరిగిన ఈ క్యాంపెయినింగ్ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు అంకురార్పణ చేసిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Next Story