రూ.7.5 కోట్ల కుంభకోణం కేసు.. IAS రోహిణి సింధూరికి బిగుస్తున్న ఉచ్చు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 03:34:57  IST  )

మైసూర్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల కొనుగోలు కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది.

రూ.7.5 కోట్ల కుంభకోణం కేసు.. IAS రోహిణి సింధూరికి బిగుస్తున్న ఉచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (Rohini Sindhuri)కి కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మైసూర్ జిల్లాలో జరిగిన ‘ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల’ కొనుగోలు కుంభకోణంలో ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు తక్షణమే అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఇంతకు ఏంటి ఆ కుంభకోణం?

2021లో రోహిణి సింధూరి మైసూర్ (Mysore) జిల్లా కలెక్టర్‌గా, అలాగే కర్ణాటక చేనేత అభివృద్ధి సంస్థ (KHDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు కోసం వివిధ స్థానిక సంస్థలకు పంపిణీ చేసేందుకు ‘ఎకో ఫ్రెండ్లీ’ బ్యాగులను కొనుగోలు చేశారు. అయితే, బయట మార్కెట్‌లో ఒక్కో బ్యాగు ధర కేవలం రూ.13 ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా KHDC నుంచి ఒక్కో బ్యాగును రూ.52 వెచ్చించి కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సామాజిక కార్యకర్త, న్యాయవాది రవిచంద్ర గౌడ కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈ కేసులో విచారణకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా, గతంలో కర్ణాటక ప్రభుత్వం రెండుసార్లు నిరాకరించింది. అంతర్గత శాఖా పరమైన విచారణలో ఆమెకు క్లీన్ చిట్ వచ్చిందని ప్రభుత్వం వాదించింది. అయితే, దీనిపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ ఎం.నాగప్రసన్న (Justice M. Nagaprasanna) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, వాటిని ప్రాథమిక దశలోనే తొలగించలేమని.. లోతైన విచారణ ద్వారానే నిజానిజాలు బయటపడాలన్నారు. శాఖా పరమైన విచారణకు, క్రిమినల్ విచారణకు సంబంధం ఉండది, ఒక దానిలో క్లీన్ చిట్ వచ్చినంత మాత్రాన రెండోది ఆగిపోదని అన్నారు. దీంతో అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) సెక్షన్ 17A కింద ఆమెపై దర్యాప్తు జరిపేందుకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. పదేపదే ఈ విషయాన్ని ప్రభుత్వం తిరస్కరించడం సరికాదని, న్యాయం జరగాలంటే విచారణ సాగాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఐఏఎస్ అధికారిణి రూప మౌద్గిల్‌తో జరిగిన వివాదం తర్వాత వార్తల్లో నిలిచిన రోహిణి సింధూరి, రూ.7.5 కోట్ల కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొనబోతోంది.

Next Story