కుప్పలుగా నోట్ల కట్టలు.. ప్రభుత్వ ఇంజినీర్ అవినీతికి నోరెళ్లబెట్టాల్సిందే

by Prasad Jukanti |   (  Updated:2026-06-07 06:08:07  IST  )

రూ. 6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభించిన ఓ ఇంజినీర్ కోట్లకు పడగలెత్తిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజిలెన్స్ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

కుప్పలుగా నోట్ల కట్టలు.. ప్రభుత్వ ఇంజినీర్ అవినీతికి నోరెళ్లబెట్టాల్సిందే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలడం కదలడం లేదని బాధితులు నిత్యం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు తగ్గట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకుంటూనే ఉన్నాయి. అయినా కొంత మంది లంచగొండి అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. దొరికే వరకు దొరలమే కదా అన్న చందంగా ప్రజలను జలగాళ్ల పట్టి పీడిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఒడిశా విజిలెన్స్ విభాగం ఓ ఇంజినీర్ ఇంటిపై నిర్వహించిన ఆపరేషన్‍లో కళ్లుచెదిరిపోయే నగదు, ఆస్తులు గుర్తించారు. ఈ సోదాల్లో అతడి కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లలో కట్టల కొద్ది నగదును స్వాధీనం చేసుకున్నారు.

భారీగా నగదు, ఆస్తులు:

కంధమాల్ జిల్లా బలిగూడ ఐటీడీఏ (ITDA) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బైకుంఠ నాథ్ బెహెరా ఇళ్లు, కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు తాజాగా ఏకకాలంలో 9 చోట్ల మెరుపు దాడులు నిర్వహించారు. బెహెరా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే నమ్మదగిన సమాచారంతో భువనేశ్వర్‌లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు వారెంట్ల ఆధారంగా అధికారులు రంగంలోకి దిగారు. అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో కూడిన పెద్ద బృందం భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పూర్, శైలశ్రీ విహార్, కానన్ విహార్, జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల, బరిపద, బలిగూడలోని ఆయన అధికారిక నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భువనేశ్వర్‌లోని నీలాద్రి విహార్‌లో దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంతో పాటు, భువనేశ్వర్, జాజ్‌పూర్ జిల్లాల్లో మరో నాలుగు నివాస గృహాలను అధికారులు గుర్తించారు. అలాగే భువనేశ్వర్‌లోని ప్రైమ్ లోకేషన్లలో 7 ప్లాట్లతో పాటు జాజ్‌పూర్, బరిపద ప్రాంతాల్లో మరికొన్ని స్థలాలు ఉన్నట్లు తేలింది. బ్యాంక్ లాకర్ల నుండి దాదాపు రూ.2 కోట్ల నగదు రికవరీ కాగా, అంతకుముందు ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ. 2.66 లక్షల నగదు పట్టుబడింది. ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఇప్పటి వరకు లభించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రూ. 6 వేల జీతంతో ప్రారంభం:

అధికారిక రికార్డుల ప్రకారం బైకుంఠ నాథ్ బెహెరా 1999లో కేవలం రూ. 6,000 నెలసరి జీతంతో జూనియర్ ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. విభిన్న గిరిజన అభివృద్ధి సంస్థలు, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసిన ఆయన, ఈ ఏడాది ప్రారంభంలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. రూ.6 వేల జీతంతో కెరీర్ ప్రారంభించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ స్థాయి ఆస్తులను ఎలా కూడబెట్టారనే కోణంలో విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఒడిశాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద అవినీతి నిరోధక దాడుల్లో ఒకటిగా ఇది నిలిచింది. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాతే ఈ ఆస్తుల పూర్తి విలువ ఎంత అనేది స్పష్టంగా తెలియనుంది.

Next Story