- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JNU: జేఎన్‌యూలో మోడీ, అమిత్ షా యాంటీ స్లోగన్స్
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో, విద్యార్థులు నిరసనలకు దిగారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మరోసారి నిరసనలతో అట్టుడికింది. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో, విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాపై రెచ్చగొట్టే నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో జేఎన్‌యూ మళ్ళీ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. దీంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగానూ వివాదం ముదిరింది. సోమవారం(జనవరి 5) రాత్రి సమయంలో క్యాంపస్‌లోని విద్యార్థుల బృందం భారీగా గుమిగూడి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, అమిత్ షాలపై వివాదాస్పద వ్యాఖ్యలతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది.
నిరసన ప్రారంభంలో 30-35 మంది విద్యార్థులే ఉన్నప్పటికీ, ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులలో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు కిజాకూట్ గోపికా బాబు ఉన్నారు. ఖలీద్, ఇమామ్ బెయిల్ పిటిషన్లపై తీర్పు తర్వాత నిరసన స్వభావం, స్వరం పెరిగిందని క్యాంపస్ భద్రతా విభాగం పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. కొంతమంది విద్యార్థులు తీవ్ర అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే నినాదాలు చేయడం ప్రారంభించారని, ఇది సుప్రీంకోర్టు ధిక్కారమని పేర్కొంది.
విద్యార్థుల స్పందన
అయితే, నినాదాలు ఎవరినీ లక్ష్యంగా చేసుకుని చేయలేదని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు స్పష్టం చేశారు. నినాదాలన్నీ సైద్ధాంతికమైనవి, ఎవరినీ వ్యక్తిగతంగా చేసినవి కాదని అదితి మిశ్రా అన్నారు. అది నిరసన కూడా కాదని పేర్కొన్నారు. అయితే, ప్రధాని మోడీ, షాకు వ్యతిరేకంగా చేసిన నినాదాలు అభ్యంతరకరంగా ఉన్నాయో లేదో చెప్పడానికి మిశ్రా నిరాకరించారు.
వర్శిటీ సీరియస్
మంగళవారం, జేఎన్‌యూ భద్రతా విభాగం.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే నినాదాలు చేసే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు అయినప్పటికీ, క్యాంపస్‌లో చట్టవిరుద్ధమైన, హింసాత్మక లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని పేర్కొంది.
ఈ ఘటనలో పాల్గొన్న విద్యార్థులు తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, తక్షణ సస్పెన్షన్, బహిష్కరణ లేదా విశ్వవిద్యాలయం నుంచి శాశ్వత బహిష్కరణ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. విశ్వవిద్యాలయాలు ద్వేషపూరిత ప్రదేశాలుగా కాకుండా లెర్నింగ్, ఐడియాలకు కేంద్రాలుగా ఉండాలని, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బాధ్యులను గుర్తించిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.






